జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్‌కు సర్వం సన్నద్ధం
హైదరాబాద్, అధాబ్ న్యూస్:
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు.
గురువారం యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్లో పాత్రికేయులకు ఆయన వివరాలు అందించారు.
నవంబర్ 14వ తేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని, మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతుందని చెప్పారు.
నోటాతో కలిపి మొత్తం 59 మంది అభ్యర్థులు బరిలో ఉన్నందున, ఈసారి ఈసీఐ అనుమతితో 42 టేబుళ్లను ఏర్పాటు చేశామని, గరిష్టంగా 10 రౌండ్లు నిర్వహించనున్నట్లు తెలిపారు.
కౌంటింగ్ ప్రక్రియను ఈసీఐ సాధారణ పరిశీలకులు, ఈసీఐ బృందం పర్యవేక్షిస్తారని, 186 మంది సిబ్బందిని కౌంటింగ్ పనుల కోసం నియమించినట్లు వెల్లడించారు. వీరిలో కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు ఉన్నారని తెలిపారు.
కౌంటింగ్ ప్రగతిని LED స్క్రీన్లు మరియు EC యాప్ ద్వారా ప్రజలకు ప్రత్యక్షంగా చూపించే ఏర్పాట్లు చేసినట్లు కూడా ఆర్.వి. కర్ణన్ చెప్పారు.









