ఇక సెలవు…! ప్రముఖ కవి–రచయిత అందెశ్రీకు కన్నీరంటి వీడ్కోలు
హైదరాబాద్, ఆధాబ్ న్యూస్:
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు ఘట్‌కేసర్‌లోని ఎన్‌ఎఫ్‌సీ నగర్ లో మంగళవారం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. ఆయన పార్థివ దేహానికి వేలాది మంది సాహితీ ప్రియులు, అభిమానులు, ప్రజలు చివరి వీడ్కోలు చెప్పారు.
అంత్యయాత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని అందెశ్రీ పాడెను భుజాన మోశారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఆప్యాయంగా ఓదార్చారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించిన అనంతరం, గౌరవ సూచికంగా పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. తరువాత అందెశ్రీ పార్థివ దేహాన్ని సమాధి చేశారు.
ఉదయం నుంచే పలువురు నాయకులు, ప్రముఖులు నివాళులర్పించారు. సీనియర్ నేత కేశవరావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తదితరులు అంతిమయాత్రలో పాల్గొన్నారు.
లాలాపేట్ నుంచి ప్రారంభమైన పార్థివ దేహం, తార్నాక – ఉప్పల్ మీదుగా ఘట్‌కేసర్ చేరుకుంది. కవి, రచయిత, సాంస్కృతిక యోధుడైన అందెశ్రీకు శ్రద్ధాంజలి అర్పిస్తూ ప్రజలు ‘ఇక సెలవు…!’ అంటూ కన్నీటి వీడ్కోలు పలికారు.









