చేప పిల్లలను సకాలంలో చెరువుల్లో వదలాలి – మంత్రి వాకాటి శ్రీహరి
హైదరాబాద్,ఆధాబ్ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా చేపల ఉత్పత్తిని వేగవంతం చేయాలనే ఉద్దేశ్యంతో సోమవారం మత్స్యశాఖ సమీక్షా సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. ఈ సమావేశంలో పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి వాకాటి శ్రీహరి, మత్స్యశాఖ ప్రత్యేక కార్యదర్శి సవ్యసాచి ఘోష్, డైరెక్టర్ నిఖిల్, రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లు, మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించామని, ఇందుకోసం రూ.123 కోట్ల బడ్జెట్ కేటాయించామని తెలిపారు. ఇప్పటికే చేప పిల్లల కొనుగోలు టెండర్ పూర్తైన జిల్లాల్లో చెరువుల్లో చేప పిల్లలను వదిలే కార్యక్రమం ప్రారంభమైందని చెప్పారు. మిగతా జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ఈ నెల 20వ తేదీ లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
మాంసాహారంలో చేపల ప్రాముఖ్యత, ప్రోటీన్ విలువ, ఆరోగ్య ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. జూరాల వంటి జలాశయాల వద్ద చేపల స్టాల్స్, ఐస్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ఆక్వా కల్చర్ అభివృద్ధి చేయాలని, దాంతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సూచించారు. చేప పిల్లల వదలిక కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, మత్స్యకార సంఘాలు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు. జిల్లాలో చేపల ఉత్పత్తిని పెంచేందుకు చెరువులు, జలాశయాల్లో చేప పిల్లలను సకాలంలో వదులుతున్నామని కలెక్టర్ తెలిపారు. నీటి లభ్యతను పరిశీలించి ఇరిగేషన్ శాఖతో సమన్వయం చేసుకొని చేప పిల్లల వదలిక కార్యక్రమం కొనసాగుతోందని చెప్పారు.
అదేవిధంగా, “టీ మత్స్య మొబైల్ యాప్” ద్వారా లబ్ధిదారుల వివరాల నమోదుకు ఇప్పటికే అవగాహన కల్పించామని, ప్రతి లబ్ధిదారు తమ వివరాలను యాప్‌లో నమోదు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా మత్స్యశాఖ ఏడి ఇంతియాజ్ ఖాన్ సహా సంబంధిత అధికారులు పాల్గొన్నారు.









