రంగారెడ్డిలో బస్సు ప్రమాదంపై విచారణకు ఆదేశించిన తెలంగాణ ప్రభుత్వం రంగారెడ్డి, ఆధాబ్ న్యూస్:
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ స్టేజీ వద్ద ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు రూ. 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది.
ఈ ఘటనపై రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, డీజీపీ, సీపీలు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసుపత్రికి చేరుకుని గాయపడిన వారిని పరామర్శించారు.
విచారణలో టిప్పర్ షాద్‌నగర్ నుంచి కంకర తీసుకుని వస్తుండగా, వికారాబాద్ చిట్టంపల్లి గేట్ దగ్గర అన్‌లోడ్ చేయడానికి వెళ్తున్నట్లు గుర్తించారు. ప్రమాదం సమయంలో టిప్పర్ ఓవర్‌లోడ్‌లో ఉండగా, దాదాపు 50 నుంచి 60 టన్నుల కంకర తీసుకువస్తున్నట్లు తేలింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం అతివేగంతో పాటు నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా టిప్పర్ అదుపు తప్పి బస్సును ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు.









