తెలంగాణలో జాయింట్ కలెక్టర్ పదవి రద్దు
అదనపు కలెక్టర్లు ఇకపై ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్లుగా
హైదరాబాద్,ఆధాబ్ న్యూస్: తెలంగాణలో జాయింట్ కలెక్టర్ పదవిని రద్దు చేస్తూ రెవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లను ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్లుగా నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఉత్తర్వుల ప్రకారం అటవీ భూముల సర్వే, భూ హక్కుల నిర్ధారణ, సెటిల్‌మెంట్ పనులు అదనపు కలెక్టర్ల పరిధిలోకి వస్తాయి. 1967 ఫారెస్ట్ యాక్ట్ కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ పర్యవేక్షణలో అమలు చేపట్టనున్నట్లు ప్రభుత్వ ప్రకటనలో వెల్లడించింది. జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్ల బాధ్యతలు
అటవీ భూముల హక్కుల నిర్ధారణ
అటవీ సరిహద్దుల ఏర్పాటు, భూ వివాదాల పరిష్కారం
భూములకు సంబంధించిన ప్రకటనలు జారీ
అటవీ ప్రాంతాల్లో విచారణలు నిర్వహించే అధికారం
అవకతవకలపై చర్యలు
1927 ఫారెస్ట్ చట్టం ప్రకారం ఈ అధికారులను నియమిస్తారు.
అదనపు కలెక్టర్ల పాత విధుల వివరాలు
ఇంతకు ముందు అదనపు కలెక్టర్లు:
కలెక్టర్‌కు సహాయకులుగా రెవెన్యూ వ్యవస్థ పర్యవేక్షణ
భూముల కేటాయింపులు, పౌరసరఫరాలు
భూభారతి కార్యక్రమాలు
గ్రామపంచాయతీలు, పురపాలక సంస్థల అభివృద్ధి పర్యవేక్షణ
పరిశుభ్రత, పచ్చదనం కార్యక్రమాలు అమలు
ప్రభుత్వ పథకాల అమలు, సమస్యల పరిష్కారం
జిల్లా పరిపాలనలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తర్వాత అదనపు కలెక్టర్ కీలక స్థానంలో ఉన్నారు.









