సమర్థవంతమైన ఆరోగ్య సేవలు అందించడంలో రాజీ లేదు – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
జిల్లా వ్యాప్తంగా ప్రజలకు నాణ్యమైన, సకాలంలో వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. త్వరలో జరగనున్న జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కార్యక్రమం నేపథ్యంలో కేంద్ర బృందం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, చాతకొండ పల్లె దవాఖాన, ఆయుష్మాన్ కేంద్రాలను తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది హాజరు, ఔషధ నిల్వలు, శుభ్రత–శానిటేషన్, ల్యాబ్, ప్రసూతి గది, పేషెంట్ వేటింగ్ హాల్స్ వంటి విభాగాల పనితీరును సమీక్షించారు.
ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు చేరువగా, అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణలో ఎలాంటి లోపాలు సహించబోమని హెచ్చరించారు.
ప్రభుత్వ ఆరోగ్యపథకాల ప్రయోజనం గ్రామస్థాయిలో ప్రతి కుటుంబానికి చేరేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. వైద్యులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా సేవలు అందించాలని అన్నారు.
కేంద్ర ఆరోగ్య బృందం పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సంబంధిత శాఖలను ఆయన ఆదేశించారు.
ఈ పర్యటనలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జయలక్ష్మి, వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.










