యువత క్రీడారంగంలో రాణించాలని పిలుపు
పినపాక, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట పంచాయతీలో మంగళవారం రోజున స్థానిక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు సూచనల మేరకు మాజీ ఎంపీటీసీ సభ్యులు పోలిశెట్టి హరీష్ ఆధ్వర్యంలో క్రీడా సామాగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ముకుందాపురం, దుబ్బగుంపు, జానంపేట ఎస్సీ కాలనీ, జానంపేట కొత్తగుంపు గ్రామాల యువతకు వాలీబాల్‌లు మరియు నెట్‌లు అందజేశారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పేరం వెంకటేశ్వరరావు, దాట్ల రాజేష్ మాట్లాడుతూ — యువత క్రీడారంగంలో రాణించాలని, క్రీడలు శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా స్నేహభావాన్ని పెంచుతాయని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలపై మక్కువ పెంపొందించుకోవాలని సూచించారు.
జానంపేట పంచాయతీ పరిధిలో త్వరలో నిర్వహించబోయే వాలీబాల్ టోర్నమెంట్లలో స్థానిక టీములు పాల్గొని విజయాలు సాధించి, పంచాయతీకి, తల్లిదండ్రులకు, క్రీడా సామాగ్రి అందజేస్తున్న కాంగ్రెస్ నాయకులకు గౌరవం తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, జానంపేట యువత, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.









