గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థినిల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ — భద్రాచలం సబ్ కలెక్టర్ మ్రినాలి శ్రేష్ట
పినపాక ,ఆధాబ్ న్యూస్
వాతావరణ మార్పులు, వర్షాల కారణంగా విద్యార్థినిల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని భద్రాచలం సబ్ కలెక్టర్ శ్రీమతి మ్రినాలి శ్రేష్ట అధికారులు, హెచ్ఎంలకు సూచించారు.
గురువారం పినపాక మండలం ఎలిసిరెడ్డిపల్లి గ్రామంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను సబ్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు, వంటగది, డైనింగ్ హాల్, డార్మెటరీ, స్టోర్ రూమ్‌లను పరిశీలించారు. విద్యార్థినిలతో మాట్లాడి వారికి సమయానికి మెనూ ప్రకారం ఆహారం అందుతున్నదో లేదో తెలుసుకున్నారు.
విద్యార్థినిలకు పౌష్టికాహారం అందించడంతోపాటు వర్షాకాలం కారణంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని హెచ్ఎం, వార్డెన్‌లను ఆదేశించారు. రాత్రి వేళల్లో విద్యార్థినిలు బయటకు రావొద్దని, విషపూరిత క్రిములు సంచరించే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఆశ్రమ పాఠశాలలో ఉన్న ఏఎన్ఎం లకు సరఫరా చేసిన మెడికల్ కిట్లను సబ్ కలెక్టర్ పరిశీలించి, విద్యార్థినిల ఆరోగ్య స్థితిని ప్రతిరోజు గమనిస్తూ అవసరమైన వైద్య చికిత్సలు తక్షణమే అందించాలన్నారు.
డైలీ వేజ్ వర్కర్లు సమ్మెలో పాల్గొనడంతో పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా లేవని గుర్తించిన సబ్ కలెక్టర్, తాసిల్దార్ గోపాలకృష్ణకు రేపటిలోగా గ్రామపంచాయతీ సిబ్బందితో పూర్తిస్థాయి శుభ్రతా కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. తాత్కాలికంగా వంట సిబ్బందిని నియమించి విద్యార్థినిలకు సమయానికి భోజనం అందేలా చూడాలని సూచించారు.
అలాగే కంప్యూటర్ క్లాసులను కూడా పరిశీలించిన సబ్ కలెక్టర్, విద్యార్థినిల ఆరోగ్యం, చదువులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వంట సిబ్బంది పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని తెలిపారు. వడ్డించే ముందు ఉపాధ్యాయులు, హెచ్ఎం మొదట ఆహారం రుచి చూసి తరువాత విద్యార్థినిలకు అందించాలని సూచించారు.
ఈ తనిఖీలో పినపాక తాసిల్దార్ గోపాలకృష్ణ, హెచ్ఎం వీరాకుమారి, వార్డెన్ శ్రీమతి విజయ తదితరులు పాల్గొన్నారు.
— అదనపు పౌర సంబంధాల అధికారి కార్యాలయం, భద్రాచలం









