అక్టోబర్‌లోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ – మూడు రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు
హైదరాబాద్,ఆధాబ్,న్యూస్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. జిల్లా కలెక్టర్లకు రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియను రెండు, మూడు రోజుల్లో పూర్తి చేయాలని సీఎస్ రామకృష్ణారావు ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లకు స్పష్టం చేశారు.
బీసీ డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన నివేదిక ప్రకారం బీసీలకు 42 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వార్డులకు గ్రామం యూనిట్‌గా, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలకు మండలం యూనిట్‌గా, జెడ్పీటీసీకి జిల్లా యూనిట్‌గా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు.
మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల కేటాయింపులో లక్కీ డ్రా విధానం అనుసరించాలని ప్రభుత్వం కలెక్టర్లకు స్పష్టం చేసింది. ఈ నెల 30లోగా ఎన్నికలు నిర్వహించాల్సిందిగా హైకోర్టు గడువు విధించగా, గడువులోగా రిజర్వేషన్లు పూర్తి చేసి ప్రచురించాల్సిందిగా సూచించింది.
ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచుతూ అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించిన బిల్లు రాష్ట్రపతి, గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక జీవో జారీచేసి రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ సంక్షేమశాఖ నుంచి జీవో వెలువడగానే పంచాయతీరాజ్ శాఖ దానిని అనుసరించి మరొక ఉత్తర్వు ఇస్తుంది.
జీవోపై కోర్టు సవాళ్లు ఎదురైనా అక్టోబర్‌లోనే ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఒకవేళ హైకోర్టు జీవోను కొట్టివేస్తే పాత రిజర్వేషన్ నిబంధనల ప్రకారమే (50% లోపు) ఎన్నికలు జరపాలని నిర్ణయించింది.
ఎంపీటీసీ ఎన్నికలు ముందుగా, ఆ తరువాత సర్పంచ్ ఎన్నికలు వారం గ్యాప్‌లో పూర్తి చేయాలని షెడ్యూల్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్లు, సిబ్బంది శిక్షణ, బ్యాలెట్ బాక్స్‌లు తదితర ఏర్పాట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి చేసింది. రిజర్వేషన్ల జాబితా వెలువడగానే షెడ్యూల్ ప్రకటించనుంది.









