తమ కుమారుడి నామకరణం కోసం కేటీఆర్ వద్దకు జెడ్పీటీసీ దంపతులు – సూర్యాంశ్ అని పెట్టిన పేరు!
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన జెడ్పీటీసీ లావణ్య, రాంబాబు దంపతులు తమ కుమారుడి నామకరణాన్ని ఒక ప్రత్యేక ఘట్టంగా మార్చుకున్నారు. రాజకీయ నేతలపై అభిమానాన్ని వ్యక్తం చేసే ఎన్నో మార్గాలు ఉన్నా… ఈ దంపతులు చూపించిన మమకారం మాత్రం అందరినీ ఆకట్టుకుంది.
తమ బిడ్డకు పేరు పెట్టాలని నేరుగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను కలిసిన వారు, ఆయన చేతుల మీదుగానే నామకరణం జరగాలని విజ్ఞప్తి చేశారు. ఈ అనూహ్య అభ్యర్థనతో కేటీఆర్ కూడా కదిలిపోయారు. కుటుంబ పెద్దల సూచన మేరకు ‘సు’ అక్షరంతో పేరు పెట్టాలని తల్లిదండ్రులు చెప్పగా, తన కొడుకు హిమాన్షు పేరును గుర్తుచేసుకుంటూ కేటీఆర్ ఆ చిన్నారికి “సూర్యాంశ్” అనే పేరు పెట్టారు.
ఈ సందర్భం తమ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఘట్టమని భావోద్వేగంతో దంపతులు తెలిపారు. “సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మాకు రాజకీయంగా గుర్తింపు, గౌరవం ఇచ్చింది కేటీఆర్. ఆయనను మా కుటుంబ పెద్దగా భావించి మా కుమారుడికి ఆయన చేతుల మీదుగా నామకరణం జరగడం గొప్ప భాగ్యంగా భావిస్తున్నాం. ఆయన ఇచ్చిన దీవెనలు మా కొడుకును కూడా గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుతాయని విశ్వాసం ఉంది” అని లావణ్య, రాంబాబు సంతోషం వ్యక్తం చేశారు.
తల్లిదండ్రుల ప్రేమను చూసి కేటీఆర్ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ, చిన్నారి భవిష్యత్తు యోగక్షేమాల గురించి ఆశీర్వదించారు. సత్కారంగా కుటుంబానికి ఒక కేసీఆర్ కిట్టు’ను అందించారు. తమ అభిమాన నేతతో గడిపిన ఈ అపూర్వ క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయని దంపతులు అన్నారు.









