తెలుగు రాష్ట్రాలకు వర్షాల అలర్ట్ – మరో అల్పపీడనం ప్రభావం
హైద్రాబాద్, ఆధాబ్ న్యూస్:
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ అయ్యింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
➡️ తెలంగాణకు భారీ వర్ష సూచన
తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 కి.మీ వేగంతో గాలులు వీస్తూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని అధికారులు హెచ్చరించారు.
➡️ ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలు
ఆదిలాబాద్, జగిత్యాల, జోగులాంబ గద్వాల్, మహబూబ్ నగర్, మెదక్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వనపర్తి, ఆసిఫాబాద్, మంచిర్యాల, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశముందని పేర్కొంది.
➡️ హైదరాబాద్లో భారీ వర్ష సూచన
హైదరాబాద్లో కూడా నేడు కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బాలాపూర్, బడంగ్పేట్, మీర్పేట్, బీఎన్ రెడ్డి, హస్థినాపురం, బోయిన్పల్లి, సికింద్రాబాద్, బేగంపేట్, మల్కాజ్గిరి, ముషీరాబాద్, ఉప్పల్, నాగోల్, గుర్రాంగూడ, కూకట్పల్లి పరిసరాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆయా ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.









