భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో ఆదివాసీ జేఏసీ ఆందోళన
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన కార్యక్రమం జరిగింది. మండలంలోని భట్టుపల్లి సెంటర్ వద్ద ఉన్న కొమరం భీమ్ విగ్రహానికి ఆదివాసీ నాయకులు పూలమాలలు అర్పించి నివాళులర్పించారు. అనంతరం సుప్రీంకోర్టులో కేసు వేసిన తెల్ల వెంకటరావు, సోయం బాపురావు ఫోటోలకు పాలాభిషేకం చేశారు.
జిల్లా కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్న సందర్భంగా ఆయన వాహనాన్ని ఆపి, లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు. అనంతరం బైక్ ర్యాలీ రూపంలో కరకగూడెం మండల కేంద్రానికి చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ సీతారామ్ నాయక్ ఆదివాసీలపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన దిష్టిబొమ్మ దహనం చేశారు.
తరువాత తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న జేఏసీ నాయకులు తహసీల్దార్‌కి కూడా వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం ఎలాంటి వెనుకడుగు వేయబోమని, లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తప్పించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ప్రభుత్వానికి హెచ్చరిక
జేఏసీ నాయకులు ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక జారీ చేస్తూ—
➡️ లంబాడీలను ఎస్టీ జాబితా నుండి వెంటనే తొలగించకపోతే ఉద్యమాన్ని జిల్లా నుండి రాష్ట్రస్థాయి వరకు ఉధృతం చేస్తామని,
➡️ రోడ్లపైకి దిగి భారీ ర్యాలీలు, ఆందోళనలు చేపడతామని,
➡️ మరింత తీవ్ర పోరాటానికి సిద్ధమవుతున్నామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల జేఏసీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యువతతో పాటు పెద్ద సంఖ్యలో ఆదివాసీ సమాజం పాల్గొన్నారు.









