దేశ అభివృద్ధికి శాస్త్రవేత్తలు అవసరం – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ దేశ అభివృద్ధి, ప్రజల భవిష్యత్ పురోగతికి శాస్త్రవేత్తలు ఎంతో అవసరమని అన్నారు. సోమవారం ఆయన కరకగూడెంలోని జవహర్ నవోదయ విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి పాఠశాల పరిస్థితులను సమీక్షించారు.
ఈ సందర్భంగా తరగతి గదులు, కిచెన్ షెడ్, స్టోర్ రూమ్, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ వారి జీవిత లక్ష్యాలను తెలుసుకున్నారు. విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలని చెప్పగా, కలెక్టర్ వ్యక్తిగత లక్ష్యాలతో పాటు దేశాభివృద్ధికి తోడ్పడే దిశగా చదువుకోవడం, పరిశోధనలు చేయడం అత్యంత ముఖ్యమని సూచించారు. సమాజ సమస్యలకు పరిష్కారాలను చూపగలిగే ఆవిష్కరణలు, పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలు దేశానికి అవసరమని విద్యార్థులను ఆయన ప్రోత్సహించారు.
డైనింగ్ హాల్లో దోమలు, ఈగలు లోపలికి రాకుండా మెష్ ఏర్పాటు చేయాలని కాంట్రాక్టర్‌ను కలెక్టర్ ఆదేశించారు. అలాగే కూరగాయలు, పెరుగు తదితర పదార్థాలు నిల్వ చేసుకునేందుకు ఫ్రిజ్ ఏర్పాటు చేయాలని సిబ్బంది అభ్యర్థనపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. విద్యార్థులు పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం తీసుకుంటూ చదువు కొనసాగించేలా ఏర్పాట్లు చేయాలని ఆయన స్పష్టం చేశారు.
నవోదయ విద్యాలయాలు దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన బ్రాండ్‌గా గుర్తింపు పొందాయని, ఆ ప్రతిష్టను నిలబెట్టే విధంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచి విద్యార్థులకు సౌకర్యాలు అందించాలని సూచించారు. అదేవిధంగా విద్యార్థుల మానసిక, శారీరక అభివృద్ధికి అవసరమైన క్రీడా సామాగ్రి, లైబ్రరీ పుస్తకాలు త్వరలోనే అందిస్తామని హామీ ఇచ్చారు.
తరువాత పాఠశాల సిబ్బందితో సమావేశమై విద్యార్థులకు అందుతున్న సదుపాయాలు, ఉన్న సమస్యలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల అభ్యున్నతికి, పాఠశాల అభివృద్ధి కోసం చేపట్టవలసిన పనులను ప్రాధాన్యతతో పరిష్కరిస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు.
ఈ పరిశీలనలో పాఠశాల ప్రిన్సిపల్ భాస్కరాచారి, ఉపాధ్యాయులు నయనాదేవి, చంచల్, అనిత, స్టాఫ్ నర్స్ రాధికతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.









