కరకగూడెం మండలంలో విద్యార్థినులకు ఉచిత సైకిళ్ల పంపిణీ
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని సైకిళ్లను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ట్రైబల్ విద్యార్థినుల కోసం ఐటీసీ సంస్థకు 300 సైకిళ్ల మంజూరు చేయాలని కోరగా, యాజమాన్యం వెంటనే స్పందించి 15 లక్షల రూపాయల విలువైన సైకిళ్లను అందించిందని తెలిపారు. ఒక్కో సైకిల్ విలువ రూ.5,000గా, 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులకు అందజేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పాఠశాలకు రాక సులభతరం అవుతుందని ఆయన అన్నారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి సారించిందని, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, విశాలమైన పాఠశాల భవనాలు, పౌష్టిక ఆహారం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ వంటి అనేక సదుపాయాలను అందజేస్తోందని గుర్తుచేశారు. అందించిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని జీవితంలో ముందుకు సాగాలని విద్యార్థినులను పిలుపునిచ్చారు.
సైకిళ్లు స్వీకరించిన విద్యార్థినులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ITC అధికారులు, MRO గంట ప్రతాప్, MPDO మారుతి, MEO మంజుల, సివిల్ సప్లయిస్ DT శివకుమార్, టీపీసీసీ సభ్యులు చందా సంతోష్ కుమార్, మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, మాజీ సర్పంచ్ తోలెం నాగేశ్వరరావు, ఎర్ర సురేష్, మండల నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.









