ప్రజాపోరాట యోధుడికి కన్నీటి వీడ్కోలు
రామానుజవరం గ్రామం కన్నీటి పర్యంతం
శోకతత్వ హృదయాలతో సీపీఐ నేత కామ్రేడ్ అయోధ్యకు అంతిమ వీడ్కోలు
మణుగూరు, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామానుజవరం గ్రామం శోకసంద్రంగా మారింది. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పొందిన సీపీఐ నేత కామ్రేడ్ బొల్లోజు అయోధ్యకు స్థానికులు, సీపీఐ శ్రేణులు, అనేక రాజకీయ పార్టీల నాయకులు కన్నీటి వీడ్కోలు పలికారు.
జిల్లా మరియు రాష్ట్ర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన సీపీఐ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యుడు కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు, జాతీయ నాయకుడు కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కలవేని శంకర్, జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల-పట్టణాల కార్యదర్శులు పాల్గొన్నారు. అలాగే సీపీఎం, కాంగ్రెస్, టీడీపీ పార్టీల నాయకులు మరియు భద్రాచలం ఎమ్మెల్యే తల్లం వెంకటరావు కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, “మణుగూరు ప్రాంత పేద ప్రజలకు, శ్రామిక మరియు కర్షక వర్గాలకు అయోధ్య బలం-బలగంగా నిలిచాడు. ఆయన పోరాటం, ప్రజల పట్ల నిబద్ధత చిరస్మరణీయమైనది. అకాల మరణం ప్రజా ఉద్యమాలకు, పార్టీకి తీరని లోటు. ఆయన ఆశయాలకు పునరంకితమవుదాం” అని అన్నారు.
కామ్రేడ్ అయోధ్య జీవితం అంతా ప్రజల కోసం, ఉద్యమాల కోసం అంకితం అయ్యింది. ఆయన లేని లోటు ఈ ప్రాంత ప్రజలకు, పార్టీకి నింపలేనిది అని పలువురు భావోద్వేగంతో తెలియజేశారు.









