భద్రాద్రి కొత్తగూడెంలో ఫేక్ అటెండెన్స్ కలకలం
పంచాయతీ కార్యదర్శులకు జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసులు
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు పంచాయతీలకు చెందిన కార్యదర్శులు విధులకు హాజరైనట్లు తప్పుడు హాజరు (ఫేక్ అటెండెన్స్) నమోదు చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ విషయాన్ని అధికారికంగా గుర్తించిన జిల్లా కలెక్టర్ (పబ్లిక్ వర్క్స్) కార్యాలయం సంబంధిత కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఈ నెల 1వ తేదీన విడుదలైన అధికార నోటీసులో, e-పంచాయతీ పోర్టల్లో నమోదైన రోజువారీ హాజరు వివరాలు, PS App ద్వారా అప్‌లోడ్ చేసిన డేటాను పరిశీలించగా… పలు మండలాలకు చెందిన కార్యదర్శులు విధులకు హాజరుకాకుండా డేటాలో హాజరైనట్లుగా నమోదు చేసినట్టు వెల్లడైంది.
ఈ తప్పుడు హాజరు అంశంపై జిల్లా కలెక్టర్ కార్యాలయం తీవ్రంగా స్పందించింది. “దీనిని తీవ్ర నిర్లక్ష్యంగా పరిగణిస్తూ, సంబంధిత కార్యదర్శులు మూడురోజుల్లోగా వివరణ ఇవ్వాలి. లేదంటే చర్యలు తప్పవు,” అని నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు.
నోటీసులో వివరణ ఇచ్చిన ఆధారాలు ఇలా ఉన్నాయి:
పంచాయతీ రాజ్ & గ్రామీణ అభివృద్ధి డైరెక్టర్ నుంచి వచ్చిన వాట్సాప్ సందేశాలు (తేదీ: 30.07.2025)
ఉన్నతాధికారుల నుండి టెలిఫోనిక్ సూచనలు
జూలై 31వ తేదీన e-పంచాయతీ పోర్టల్ నుంచి సేకరించిన హాజరు నివేదిక
ఈ వివరాలన్నింటి ఆధారంగా నిర్ధారించబడిన ‘ఫేక్ అటెండెన్స్’కు సంబంధించిన కార్యదర్శుల జాబితాను ‘ రూపంలో జతచేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై మండల స్థాయి పంచాయతీ అధికారులకు కూడా సమాచారం పంపించినట్లు పేర్కొన్నారు.
ఈ షోకాజ్ నోటీసు TG CC&A రూల్స్, 1991 ప్రకారం తీసుకున్న తొలి చర్యగా భావించవచ్చు. సంబంధిత కార్యదర్శులు సమాధానం ఇవ్వకపోతే తదుపరి క్రమశిక్షణాత్మక చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
ఇది గుణపాఠం కావాలి:
ఈ ఘటన జిల్లాలోని ఇతర పంచాయతీ ఉద్యోగులకు హెచ్చరికగా మారింది. బాధ్యతల నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే అధికారికంగా ఎలా చర్యలు తీసుకుంటారో ఈ ఘటన స్పష్టం చేసింది.









