కస్తూరిబా పాఠశాలలో కలెక్టర్ సందర్శన – విద్యార్థులతో ముఖాముఖి
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో విద్యావాతావరణాన్ని సమీక్షించేందుకు జిల్లా కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ సోమవారం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు.
6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటిస్తూ, వారి అభిరుచి, సామర్థ్యాలు తెలుసుకున్నారు. బోధన విధానం, ఉపాధ్యాయుల శైలి, విద్యార్థుల ప్రతిభపై ప్రాధాన్యతతో సమీక్ష చేపట్టారు.
తర్వాత పాఠశాల పరిసరాల్లోని వసతి గదులు, భోజనాల గది, ఫర్నిచర్, పారిశుధ్య పరిస్థితులను పరిశీలించి, విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయాల మెరుగుదలపై దృష్టి సారించారు. స్పెషల్ ఆఫీసర్ డి. శ్రీదేవిని ఆదేశించి, టాయిలెట్లు, నీటి వసతి, ఆరోగ్య పరిరక్షణ, కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ తరగతుల ఏర్పాటుపై తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
అంతేకాక, కరకగూడెం మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న తాత్కాలిక నవోదయ పాఠశాల పనులను కూడా కలెక్టర్ సమీక్షించారు. వసతి, ఫర్నిచర్ వంటి ఏర్పాట్లను పరిశీలించి, త్వరలోనే ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్శనలో మండల విద్యాధికారి జి. మంజుల, తహసీల్దార్ గంట ప్రతాప్, డిప్యూటీ తహసీల్దార్ వట్టం కాంతారావు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పి. కృష్ణ ప్రసాద్, ఎఇ శ్రీనివాస్, ఎంపీడీవో మారుతి యాదవ్, గ్రామ సెక్రటరీ రామకృష్ణ పాల్గొన్నారు.









