ఫ్రిజ్‌లో పెట్టిన మటన్ తినగా RTC కండక్టర్ మృతి, ఏడుగురు అస్వస్థతకు గురి
హైదరాబాద్, ఆధాబ్ న్యూస్:
సిటీ లోని వనస్థలిపురంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఫ్రిజ్‌లో నిల్వ చేసిన మటన్ తినడంతో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది అస్వస్థతకు గురయ్యారు.
విషాదకరంగా, వారిలో ఒకరు – ఆర్టీసీ కండక్టర్ శ్రీనివాస్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
వివరాల్లోకి వెళ్తే…
వనస్థలిపురం RTC కాలనీకి చెందిన కుటుంబం ఆదివారం బోనాల పండుగ సందర్భంగా మటన్ వండుకొని తిన్నారు. మిగిలిన మటన్‌ను ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి, సోమవారం (జూలై 22) మళ్లీ తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయిందని సమాచారం.
ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో శ్రీనివాస్ అనే వ్యక్తి పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మృతిచెందారు. మిగిలిన ఏడుగురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫుడ్ పాయిజనింగ్ ఎలా జరిగిందో స్పష్టత కోసం ఫుడ్ సాంపిళ్లను ల్యాబ్‌కి పంపినట్లు సమాచారం.









