గ్రంథాలయాలు సరస్వతి నిలయాలు – మంత్రి సీతక్క
ములుగు,ఆధాబ్ న్యూస్:గ్రంథాలయాలు నిరుద్యోగ యువతకు జ్ఞానద్వారాలు అంటూ, ఉద్యోగ అవకాశాలను సాధించేందుకు అవి ఎంతగానో దోహదపడతాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు.
మంగళవారం ములుగు జిల్లా కేంద్రంలో రూ.25 లక్షల నిధులతో నిర్మించిన నూతన జిల్లా గ్రంథాలయ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా రూ.16.50 లక్షలతో నిర్మించిన గ్రౌండ్ లెవెలింగ్, టాయిలెట్ బ్లాక్, కాంపౌండ్ వాల్‌లను కూడా ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణి, అదనపు కలెక్టర్ మహేందర్ జీలు పాల్గొన్నారు.
జ్ఞానం అత్యవసరం:
“ప్రతి ఒక్కరికీ కూడు, గూడు, గుడ్డ ముఖ్యమైనట్లే జ్ఞానం కూడా అవసరం. విద్యార్థులు ప్రతిరోజూ లైబ్రరీలు సందర్శించి పుస్తకాలు చదివే అలవాటు పెంచుకోవాలి,” అని మంత్రి సూచించారు.
గ్రంథాలయంలో ఆరుబయట పఠన ఏర్పాట్ల కోసం రూ.10 లక్షలతో చెట్లు నాటడం, సీసీ రోడ్డు నిర్మాణం చేపడతామని చెప్పారు. ములుగు జిల్లాలో అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలతో పలు పనులు చేపట్టామని, కూరగాయల మార్కెట్ ఆధునికీకరణ పనులు వేగంగా పూర్తవుతాయని తెలిపారు.
ఐటీ రంగాభివృద్ధి, పోటీ పరీక్షల సహాయం:
ఒక ఐటీ సంస్థ ఇప్పటికే ములుగులో నెలకొల్పగా, మరో రెండు ఐటీ సంస్థల కోసం రూ.4 కోట్లతో భవనాలు నిర్మిస్తున్నామని వెల్లడించారు. పోటీ పరీక్షల సమయంలో గ్రంథాలయాల్లో చదువుతున్న నిరుద్యోగులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
పర్యాటక అభివృద్ధి:
గట్టమ్మ వద్ద పర్యాటక జంక్షన్ ఏర్పాటు చేస్తామన్నారు. “ములుగును ప్రేమిస్తున్నా” అనే నినాదాన్ని ప్రజలలో స్థిరపరుస్తామని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు.
గ్రంథాలయాల పట్ల ఆదరణ:
ఈ సందర్భంగా రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ మాట్లాడుతూ, పుస్తక పఠనం ద్వారానే సమాజం లోపల మార్పు వస్తుందని అన్నారు. ములుగు జిల్లా చరిత్ర, పర్యాటక విశిష్టతలను అభివృద్ధి చేయడంలో మంత్రి సీతక్క పాత్ర కీలకమన్నారు.
డీసీసీబీ కొత్త భవనానికి ప్రారంభం:
ఆ తర్వాత ములుగు డీసీసీ బ్యాంక్ నూతన భవనాన్ని మంత్రి సీతక్క, టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, అదనపు కలెక్టర్ మహేందర్ జీలతో కలిసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలు, అధికారులు, బ్యాంకు సిబ్బంది, గ్రంథాలయ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, యువత, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.









