మణుగూరు,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో డిఎస్పీ రవీందర్ రెడ్డి ప్రజలకు ముఖ్య సూచనలు చేశారు. గంజాయి వాడకం యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గమనించాలంటూ సూచించారు.
“గంజాయి వంటి మత్తుపదార్థాలకు బానిసలుగా మారి యువత తమ విలువైన జీవితాన్ని మసకబారుస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి,” అని డిఎస్పీ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు.
అలాగే, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. హెల్మెట్ లేనివారికి ప్రమాదాల నుంచి రక్షణ లేదని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు.
ఈ సందర్భంగా సైబర్ నేరాలపై కూడా ప్రజలను హెచ్చరించారు. “ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉండే ఈ డిజిటల్ యుగంలో, రకరకాల లింకులు, ఆన్లైన్ గేమ్స్ ద్వారా మోసాలు జరుగుతున్నాయి. కొందరు లక్షల రూపాయలు కోల్పోతున్నారు. అందుకే అనుమానాస్పద లింకులను తడబడకుండా తక్షణమే తొలగించాలి,” అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సైబర్ భద్రత, యువత భవిష్యత్తు రక్షణలో భాగంగా పోలీసులు నిరంతరం కృషి చేస్తారని డిఎస్పీ తెలిపారు.









