ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూత
తెలుగు చిత్రసీమలో అపారమైన క్షోభ
హైదరాబాద్, జూలై 13 ఆధాబ్ న్యూస్:
తెలుగు సినిమా ప్రముఖ నటుడు, విలక్షణ నటనకు పేరుగాంచిన కోటా శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి వార్తతో సినీ పరిశ్రమ, రాజకీయ వర్గాల్లో దిగ్భ్రాంతి నెలకొంది.
1942, జూలై 10న కృష్ణా జిల్లాలోని కంకిపాడు గ్రామంలో జన్మించిన కోటా శ్రీనివాసరావు, తొలుత నాటక రంగంలో నిపుణత సాధించిన అనంతరం 1978లో ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టారు. ఆ తర్వాత నాలుగు దశాబ్దాలుగా సినీరంగాన్ని సేవిస్తూ, 750కి పైగా చిత్రాల్లో నటించారు. విలన్‌గా, హాస్య నటుడిగా, కీలక పాత్రధారిగా ఆయన్ని ప్రేక్షకులు ఆదరించారు.
కేవలం నటుడిగానే కాకుండా రాజకీయ రంగంలో కూడా కోటా శ్రీనివాసరావు తనదైన ముద్ర వేశారు. 1999 నుండి 2004 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ తరపున ఎమ్మెల్యేగా సేవలందించారు.
ఆయన మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. తెలుగు సినీ ప్రపంచంలో కోటా శ్రీనివాసరావు మిగిల్చిన వారసత్వం చిరస్మరణీయమై నిలిచిపోతుంది.









