దేశానికే మోడల్‌గా తెలంగాణ ఇందిరమ్మ ఇండ్లు
ఇప్పటివరకు 3 లక్షల గృహాల మంజూరు – మంత్రి పొంగులేటి
హైదరాబాద్,ఆధాబ్ న్యూస్: పేదల కలలు కల్లలవకుండా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ముందడుగు వేస్తోందని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో తెలంగాణ దేశానికే మోడల్‌గా మారిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.
సోమవారం ఆయన ఇందిరమ్మ గృహ నిర్మాణాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ—
“దేశంలో ఏ ప్రభుత్వం కూడా ₹5 లక్షల వ్యయంతో ఇళ్లు నిర్మించడంలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకుంది” అని తెలిపారు.
ప్రతీ ఇంటికి ఉచితంగా ఇసుక
ఇందిరమ్మ గృహ నిర్మాణం కోసం ప్రతి ఇంటికి 40 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా అందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పేదలకు మరింత చేయూత ఇవ్వాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్టు తెలిపారు.
సొంతింటి కల సాకారం
పాత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పేదలు కంటున్న సొంతింటి కలలు నెరవేరలేదని, కానీ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం ఆ కలను సాకారం చేస్తోందన్నారు.
ఈ ఏడాది ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున మొత్తం 4.5 లక్షల ఇండ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. ఇప్పటివరకు 3 లక్షల ఇండ్లు మంజూరయ్యాయని, అందులో 1.23 లక్షల ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నట్లు తెలిపారు.
లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ బిల్లుల చెల్లింపుల్లో పారదర్శకతను పెంచేందుకు ప్రతి సోమవారం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నిధులు జమ చేస్తున్నట్లు మంత్రి వివరించారు.
పట్టణాలపై ప్రత్యేక దృష్టి
గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణం కొలిక్కివచ్చిన నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణంపై దృష్టి సారించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అవసరమైన స్థలాలను గుర్తించాల్సిందిగా, కార్యాచరణను త్వరితంగా రూపొందించాల్సిందిగా సూచించారు.
హైదరాబాద్‌తో పాటు వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ తదితర పట్టణాల్లో కూడా ఇదే విధంగా పథకాన్ని అమలు చేయాలని ఆదేశించారు.









