కరకగూడెం, ఆధాబ్ న్యూస్:రోజుల
గడుస్తున్నా గిరిజన గ్రామాల వేదన తీరడం లేదు. తాజాగా కరకగూడెం మండలంలోని అతి మారుమూల ప్రాంతమైన నీలాద్రిపేట గ్రామంలో ఒక మహిళ ప్రాణాలు రక్షించేందుకు ఆ గ్రామస్థులు చేసిన సాహసం అందరికీ గుబురు తలెత్తేలా చేసింది.
పద్మాపురం పంచాయతీకి చెందిన మాడవి ఉంగమ్మ (36) అనే గిరిజన మహిళ బుధవారం తీవ్ర జ్వరం, విరోచనాలతో బాధపడుతూ అపస్మార స్థితిలోకి వెళ్లిపోయింది. అయితే గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల గ్రామానికి వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. సతీమణి పరిస్థితి విషమించడంతో భర్త మాడవి జోగయ్య వెంటనే గ్రామస్తులను ఆశ్రయించాడు.
ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో గ్రామస్థులు జెడ్డి సహాయంతో ఆమెను భుజాలపై మోసుకుంటూ, వాగులు, వంకలు దాటి ఆరు కిలోమీటర్లు కాలినడకన రోడ్డు దాకా తీసుకువచ్చారు. అక్కడికే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా, వెంటనే స్పందించి మణుగూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఉంగమ్మ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అయితే గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ, “ఈ మారుమూల గ్రామానికి కనీస రహదారి లేకపోవడం వల్ల ప్రతి అత్యవసర సమయాన్ని మేము మరణభయంతో ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం కనీసం రోడ్డు సౌకర్యాన్ని కల్పించాలి” అని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ సంఘటన ఆదివాసీ జనజీవితంలో ఉన్న అసమానతలను, పరాధీనతలను బట్టబయలు చేస్తోంది. అభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చవుతున్నా, ఇటువంటి గ్రామాల్లో మాత్రం ప్రాణాలు మోసుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి ఎప్పుడు ముగుస్తుందో తెలియడం లేదు.









