ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ప్రైవేట్ పాఠశాలల ఇష్టారాజ్యం పై ఆగ్రహం .

ప్రైవేట్ పాఠశాలల ఇష్టారాజ్యం పై ఆగ్రహం

మణుగూరు ఆధాబ్ న్యూస్:
ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీపై ఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రేమ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, మణుగూరు మండల పరిధిలో ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నట్లు ఆరోపించారు.

పాఠశాలలు ఫీజులకు తోడు, యూనిఫామ్, పుస్తకాలు, నోటుబుక్స్, బస్సు ఛార్జీలు వంటి అదనపు ఖర్చులను కూడా భరింపజేస్తున్నాయని తెలిపారు. ఈ విధంగా సామాన్య తల్లిదండ్రుల ఆకాంక్షను అవకాశంగా మలచుకుంటూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు.

ప్రభుత్వ పాఠశాలలను బలహీనపరిచి ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రోత్సాహం ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. కొందరు తల్లిదండ్రులు వడ్డీపై డబ్బులు తెచ్చి పిల్లలను చదివించాల్సిన పరిస్థితి ఉందని, ఇది వారి ఆర్థిక స్థితిని దిగజారుస్తోందని తెలిపారు.

విద్యాశాఖ ఉదాసీనతపై విమర్శలు:

విద్యాశాఖ అధికారులు ఇంత జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. జి.ఓ. నెం.1 ప్రకారం ప్రభుత్వ పాఠశాలల పుస్తకాలనే ప్రైవేట్ పాఠశాలల్లో ఉపయోగించాల్సి ఉంటుందని గుర్తుచేశారు. అలాగే అడ్మిషన్ ఫీజు వసూలు చేయడానికి ఎలాంటి అనుమతులేదు అని తెలిపారు.

ఎంఈఓ స్పందన:

ఈ సందర్భంగా ఎంఈఓ స్వర్ణజ్యోతి మాట్లాడుతూ, “ప్రైవేట్ పాఠశాలల్లో యూనిఫామ్, పుస్తకాలు అమ్మితే చర్యలు తప్పవు. ఫీజుల నియంత్రణ కోసం తల్లిదండ్రులతో కలిసి కమిటీలు ఏర్పాటు చేయాలి. అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం నాయకులు జిమ్మిడి ప్రకాష్, గోగు సాయి, బాడిస సువాస్, వంశి, దినేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎన్‌ఎస్ఎఫ్ స్పష్టం చేసింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!