ప్రజావాణిలో ప్రజల గోడులు వినిన అధికారులు – తగిన చర్యలకు ఆదేశాలు
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
జిల్లాలోని ప్రజల అభ్యర్థనలకు స్పందిస్తూ, ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును పూర్తిగా పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పౌరులు తమ సమస్యలను అధికారులు ముందు ఉంచారు. వాటిలో కొన్ని ముఖ్యమైన ఫిర్యాదులు ఇవే:
పాల్వంచకు చెందిన మడిపల్లి నందిని (W/o అశోక్) – మౌన వ్యాధి అయిన ఈ మహిళ పదో తరగతి వరకు చదివిందని, తనకు నివాసం లేకపోవడంతో పాటు ప్రభుత్వంలో చిన్న ఉద్యోగం ఇవ్వాలంటూ చేసిన వినతిని జిల్లా ఉపాధి కల్పనా అధికారికి ఎండార్స్ చేశారు.
పాల్వంచ రంగాపురం గ్రామానికి చెందిన బానోతు ఉపేందర్ – తన కుమారుడికి TGSET పరీక్ష గురించి తెలియక గురుకులంలో చేరలేకపోయాడని, భద్రాచలం బీసీ గురుకుల వసతి గృహంలో ఆరో తరగతి అడ్మిషన్ ఇప్పించాలంటూ చేసిన అభ్యర్థనను వెనుకబడిన తరగతుల అధికారికి ఎండార్స్ చేశారు.
లక్ష్మీపురం గ్రామానికి చెందిన దుర్గాల వెంకటేశ్వర్లు – గ్రామంలో సుమారు 1000 మంది కార్మికులు ఉండడంతో, అక్కడ సంత నిర్వహణకు అనుమతి కోరుతూ చేసిన విజ్ఞప్తిపై పోలీసు శాఖ స్థల పరిశీలన చేయలేదని తెలిపారు. దీనిపై చర్యలు తీసుకోవాలని OSDకి ఎండార్స్ చేశారు.
మొండికుంట గ్రామానికి చెందిన మర్రి కృష్ణారెడ్డి – తాను సొంతంగా కొన్న భూమికి పట్టాదారు పాస్ బుక్ మంజూరు చేయాలని కోరుతూ చేసిన దరఖాస్తును అశ్వాపురం తాసిల్దార్కు ఎండార్స్ చేశారు.
తాటిగూడెం గ్రామానికి చెందిన జాడి సాంబలక్ష్మి –, సోమయ్య ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయి, పంచాయతీ సిబ్బంది ఆధార్, ఫోటోలు తీసి వెళ్లినా, తరువాత కమిటీ వారి ద్వారా తన పేరు తొలగించబడిందని ఫిర్యాదు చేశారు. గతంలో తుఫాన్ వల్ల ఇల్లు పూర్తిగా ధ్వంసమైందని, పునః మంజూరు చేయాలంటూ చేసిన దరఖాస్తును పిడి హౌసింగ్ అధికారికి ఎండార్స్ చేశారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల అభ్యర్థనలపై విభాగాల అధికారులు జాప్యం లేకుండా స్పందించాలనీ, ప్రజావాణిలో వచ్చిన ప్రతి సమస్యకు తగిన పరిష్కారం కల్పించాల్సిన బాధ్యత తమదేనన్నారు.









