బండిపై 233 ట్రాఫిక్ చలాన్లు.. రూ. 45,350 బాకీ..
వరంగల్, ఆధాబ్ న్యూస్:
“ఒక్కోసారి జరిమానా కన్నా బండి విలువ తక్కువైపోతుంది!” — ఈ మాట సూటిగా సరిపోయిన సంఘటన కాజీపేటలో చోటుచేసుకుంది. వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కాజీపేట ట్రాఫిక్ సర్కిల్‌లో తనిఖీలు జరుపుతున్న ట్రాఫిక్ సీఐ వెంకన్న సిబ్బందితో కలిసి కాజీపేట చౌరస్తాలో వాహన తనిఖీలు చేస్తుండగా, హన్మకొండకు చెందిన అస్లాం అనే వ్యక్తి ద్విచక్ర వాహనం ఆపారు.
తనిఖీలో అస్లాం వాహనానికి ఏకంగా 233 ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు బయటపడింది. మొత్తం బాకీ రూ. 45,350. నిబంధనల మేరకు పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అయితే అసలైన ట్విస్ట్ ఇదే. వాహనం సుమారు 20 ఏళ్ల పురాతనది. మార్కెట్‌లో ధర వేసుకుంటే పది వేల రూపాయలు కూడా రావు. దీంతో అస్లాం గారు నేరుగా ఓ నిర్ణయానికి వచ్చారు:
“ఈ బండి మీదే సారు, నేను డబ్బులు కట్టలేను” అంటూ బండి అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.









