భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివాసి పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారుల దాడులు, దౌర్జన్యాలు తీవ్రంగా పెరుగుతున్నాయని తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి డి. పున్నంచంద్, జిల్లా నాయకుడు కుంజా వెంకటేశ్వర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
శనివారం బూర్గంపాడు మండలంలో జరిగిన అత్యవసర సమావేశంలో వారు మాట్లాడుతూ — బూర్గంపాడు మండలం ఇరవెండి గ్రామంలోని ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారులు అక్రమంగా దాడులకు దిగుతున్న ఘటనలను ఖండిస్తున్నామని తెలిపారు. పోడు భూములు బలవంతంగా స్వాధీనం చేసుకోవడం అన్యాయమని, ప్రభుత్వం తక్షణమే దీనిపై జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోడు భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చి కొన్ని ఇవ్వడం, మరికొన్ని పెండింగ్లో పెట్టడం వల్ల ఆదివాసీల నమ్మకాన్ని దెబ్బతీసిందని, అదే కారణంగా ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని గుర్తు చేశారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినా పరిస్థితులు మారలేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం చివరి ఎకరం వరకు పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహంతో వ్యవహరిస్తూ, తిరిగి ప్రజలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ప్రజలే తమపై దాడి చేసినట్లు కేసులు నమోదు చేయడం అనేది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, దీనిని అడ్డుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి తోలేం మమత, అధ్యక్షురాలు కుంజ సోమక్క, సహాయ కార్యదర్శి సొందీ గోపమ్మ, రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కారం నరసింహారావు, నాయకులు సోడె రామకృష్ణ, పూజిత, శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.









