ఉల్లాసంగా భద్రాచలంలో ఒలింపిక్ డే రన్
ప్రముఖుల హాజరుతో 200 మందికి పైగా క్రీడాకారులు ఉత్సాహంగా పరుగులు
భద్రాచలం, ఆధాబ్ న్యూస్:
అంతర్జాతీయ ఒలింపిక్ డే సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపిక్ డే రన్ ఉల్లాసంగా ముగిసింది. ఈ కార్యక్రమం జూన్ 18న పాల్వంచలో ప్రారంభమై నిన్న దమ్మపేట చేరుకుని, ఈ రోజు ఉదయం 6:30 గంటలకు భద్రాచలంలో ఘనంగా నిర్వహించబడింది.
ఈ సందర్భంగా ఒలింపిక్ జ్యోతిను క్రీడాకారులు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావుకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, “భద్రాచలంలో త్వరలో 400 మీటర్ల అథ్లెటిక్స్ ట్రాక్ నిర్మాణం చేపట్టేందుకు ఐదు ఎకరాల భూమిని సేకరిస్తున్నాం. యువ క్రీడాకారుల భవిష్యత్‌కు ఇది దోహదపడుతుంది,” అని తెలిపారు.
ఐటీడీఏ పిఓ బి రాహుల్, ఐఏఎస్ మాట్లాడుతూ, “భద్రాచలం పరిసర ప్రాంతాల్లో గిరిజన యువకులు అనేక క్రీడల్లో ప్రతిభ చూపుతున్నారు. వారికి అవసరమైన మద్దతు అందించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వారిని నిలబెట్టేందుకు కృషి చేస్తాం,” అని చెప్పారు.
ఏఎస్పీ విక్రమ్ కుమార్ సింగ్, ఐపీఎస్ వ్యాఖ్యానిస్తూ, “యువత గంజాయి వంటివాటికి దూరంగా ఉండి క్రీడలవైపు దృష్టి పెడితే భద్రాచలం గంజాయి రహిత పట్టణంగా మారుతుంది,” అని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జి. యుగంధర్ రెడ్డి, చైర్మన్ కే. మహిధర్, చీఫ్ పాటర్న్ నాగ సీతారాములు, వైస్ ప్రెసిడెంట్ వై. వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీ పి. నాగేంద్రబాబు, కన్వీనర్ గిరి ప్రసాద్, టెన్నిస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు దాట్ల రాజు, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ట్రెజరర్ కుంచాల రమేష్, పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి రామ్ రెడ్డి, పీడీలు శ్వేత, దుర్గారావు, ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ సెంటర్ నుంచి ప్రారంభమైన రన్లో సుమారు 200 మందికి పైగా క్రీడాకారులు పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా జిల్లా క్రీడా అభివృద్ధిపై పలువురు శ్రేణులు విలువైన సూచనలు చేశారు.









