రైతు నేస్తం కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
ఈ నెల 16వ తేదీ సోమవారం జరగనున్న రైతు నేస్తం కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రైతులతో ముఖాముఖి చర్చించనున్న నేపథ్యంలో, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు.
కార్యక్రమ నిర్వహణపై శనివారం అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన కలెక్టర్, జిల్లాలోని 58 రైతు వేదికల్లో కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలన్నారు. మామిడి తోరణాలు, రంగవల్లులతో వేదికలను అలంకరించాలనీ, రైతులు మధ్యాహ్నం 2:30 గంటలకే వేదిక వద్దకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కార్యక్రమం సమయంలో ఆడియో, వీడియో వ్యవస్థలలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే ముందు రోజే పరీక్షించాలన్నారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు.
మహిళా రైతుల హాజరును ప్రోత్సహించాలనీ, స్థానిక ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు పంపించాలని సూచించారు. ప్రతి వేదిక వద్ద రైతు భరోసా నిధుల జమ వివరాలు, అలాగే ABCD డ్రైవ్‌పై అవగాహన స్టాల్స్, మునగ సాగులో విజయం సాధించిన రైతుల అనుభవాలు అందించాలన్నారు.
ఇక, మహిళా సమైక్య సభ్యులకు అజోల్లా పెంపకం, బయోచార్ తయారీ, చేపల పెంపకం వంటి అంశాలపై ఏపీఎంలు అవగాహన కల్పించాలి అని కలెక్టర్ సూచించారు. ఇంకుడు గుంతల నిర్మాణం ద్వారా జిల్లా దేశస్థాయిలో ప్రశంసలు అందుకుంటోందని తెలిపారు. రానున్న వర్షాకాలంలో వర్షపు నీరు నిలిచే ప్రదేశాల్లో వెంటనే గుంతలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు.









