అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను పర్మినెంట్ చేయాలి: టియుసిఐ జిల్లా అధ్యక్షుడు ఆర్. మధుసూదన్ రెడ్డి డిమాండ్
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్: అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల సమస్యను పట్టించుకోవాలని, వారిని శాశ్వత ఉద్యోగులుగా నియమించాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టియుసిఐ) జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలని కూడా ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించిన పంచాయతీ కార్యదర్శుల శ్రమను ప్రభుత్వం చౌకగా దోచుకుంటోంది. తక్కువ వేతనాలు చెల్లిస్తూ, నెలల తరబడి జీతాలు పెండింగ్లో ఉంచడం వల్ల వారు ఆర్థికంగా, మానసికంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
పలు గ్రామాల్లో సర్పంచులు లేకపోవడం, నిధుల కొరత కారణంగా పంచాయతీ పరిపాలన మొత్తం ఈ కార్యదర్శుల భుజాలపైనే ఉందని, అయినా వారికి తగిన గుర్తింపు, సురక్షిత జీవనం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
“దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇప్పటికే ‘సమాన పనికి సమాన వేతనం’ చెల్లించాలని తీర్పు చెప్పింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఆ తీర్పును అమలు చేయకపోవడం దారుణం” అని మండిపడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1100 మంది అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నారని, వీరందరినీ వెంటనే పర్మినెంట్ చేసి, పెండింగ్ వేతనాలను చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.









