జర్నలిస్టు పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ
టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) కృషికి ఫలితంగా విద్యాశాఖ సర్కులర్ జారీ
ఖమ్మం,ఆధాబ్ న్యూస్ : ఖమ్మం జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు శుభవార్త. ప్రైవేటు విద్యాసంస్థలలో చదువుతున్న జర్నలిస్టు పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులు అధికారికంగా సర్కులర్ జారీ చేశారు. టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా కమిటీ వినతిపై అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
టీజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా నాయకులు రామకృష్ణ, శెట్టి రజినీకాంత్, ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుద్దేటి రమేష్ బాబు వినతిపత్రం సమర్పించగా, జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) సామినేని సత్యనారాయణ, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కే. రవిబాబు అనుకూలంగా స్పందించారు.
2025–26 విద్యా సంవత్సరానికి గాను ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలలో చదువుతున్న జర్నలిస్టు పిల్లలకు ఈ ఫీజు రాయితీ వర్తించనుంది. నర్సరీ నుండి పదవ తరగతి వరకు, అలాగే ఇంటర్మీడియట్ వరకు రాయితీ వర్తింపజేస్తూ శుక్రవారం అధికారిక సర్కులర్ విడుదల చేశారు.
ఈ మేరకు అన్ని ప్రైవేటు విద్యాసంస్థలకు సర్కులర్ కాపీలు పంపినట్లు అధికారులు తెలిపారు. గత సంవత్సరం మాదిరిగా ఈ ఏడాది కూడా తక్షణమే స్పందించిన అధికారులు టీజేఎఫ్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని చర్యలు చేపట్టారు.
ఫీజు రాయితీ సర్కులర్ కాపీలను ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుద్దేటి రమేష్ బాబు అందుకున్నారని తెలిపారు. జర్నలిస్టు కుటుంబాలకు ఈ చర్య ద్వారా గణనీయమైన ఉపశమనంగా నిలవనుంది.
ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని టీజేఎఫ్ జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తూ, సర్కులర్ కాపీలను ఆయా పాఠశాలల యాజమాన్యానికి చూపించి రాయితీ పొందాలని సూచించింది. తాము చేసిన విజ్ఞప్తికి వెంటనే స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారులకు సంఘం కృతజ్ఞతలు తెలిపింది.









