టీచర్లను నిలదీసిన సామాన్యుడు: “మీ పిల్లలే ప్రభుత్వ స్కూళ్లలో చదవడం లేదంటే మీరు చెప్పే బోధే ఎలా నమ్మాలి?”
ఆదిలాబాద్, ఆధాబ్ న్యూస్:
ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధికి టీచర్లు చేపట్టిన “బడిబాట” కార్యక్రమం అనూహ్య మలుపు తిరిగింది. ఆదిలాబాద్ జిల్లా యపల్గూడ గ్రామంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీచర్లను ఓ సామాన్యుడు నిలదీసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
“మీరు ప్రభుత్వ పాఠశాలల బాగుపై మాట్లాడుతున్నారు. మరి మీ పిల్లలే ప్రభుత్వ స్కూల్లో చదవడం లేదంటే, మీరు చెప్పే బోధనే ప్రజలు ఎలా నమ్మాలి?” అంటూ ప్రశ్నించాడు. “ప్రైవేట్ స్కూళ్లలో టెన్త్, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్లే పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. డిగ్రీలు, బీఈడీలు ఉన్న మీరు ప్రభుత్వ స్కూల్లో పనిచేస్తూ కూడా ఏం మార్పు తెస్తున్నారు?” అంటూ ధ్వజమెత్తాడు.
ఈ ప్రశ్నలు టీచర్లను కాసేపు ఖంగుతినిపించాయి. కొంతమంది స్పందించేందుకు యత్నించినా, ఆ వ్యక్తి ఆవేదనతో మాట్లాడడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తర్వాతి క్షణాల్లో వీడియో తీసిన కొంతమంది యువకులు దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, ఈ ఘటన ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.
తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్చాలని ఉపాధ్యాయులే ముందు కొలవాలన్న ఆ వ్యక్తి వ్యాఖ్యలు, ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో ఉన్న అనిశ్చితిని వెల్లడిస్తున్నాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
– ప్రాథమిక నివేదిక









