సింగరేణిలో అధికారుల ఇష్టారాజ్యం..!
సీటు వదిలేదే లే… ఏరియాలోనే తిష్ట వేసిన అధికారులు
కీలక పోస్టులు వదలని వైనంపై సమగ్ర విచారణకు డిమాండ్
మణుగూరు,ఆధాబ్ న్యూస్: సింగరేణి కాలరీస్ సంస్థలో కొంతమంది అధికారులు సంస్థ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఏళ్ల తరబడి ఒకే ఏరియాలో తిష్ట వేసి, కీలక పదవుల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నె రవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఆయన – ‘‘సింగరేణిలో కొందరు అధికారులు బదిలీ అయినా కదలకుండా స్థానిక యూనియన్లు, రాజకీయ నాయకులతో స్నేహబంధాలు ఏర్పరచుకుని చక్రం తిప్పుతున్నారు. వీరి వల్ల గనులపై నియంత్రణ, నియమాలు నీరుగారుతున్నాయి. అవినీతి, అక్రమాలకు పాదవాసులవుతున్న ఈ వ్యవస్థపై సీ అండ్ ఎండి బలరాం నాయక్ తక్షణం దృష్టి సారించాలని’’ డిమాండ్ చేశారు.
కీలక పోస్టులు.. చెల్లే చెల్లెమ్మలు!
ఏడేళ్లు, ఎనిమిదేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న అధికారి, ఉద్యోగ సంఘ నేతలు స్థానిక కార్మికులకు న్యాయం చేయకుండా, తమ అనుచరులకు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు, సింగరేణి క్వార్టర్లు, ఎస్ఎంఎస్ ప్లాంట్ ఉద్యోగాలను కేటాయిస్తున్నారని రవి ఆరోపించారు. దీనివల్ల భూ నిర్వాసిత యువత తీవ్ర అన్యాయాన్ని ఎదుర్కొంటున్నారు.
నజరానాలతోనే పనులు?
కొన్ని కీలక ఉద్యోగాలకోసం నగదు, బహుమతుల రూపంలో నజరానాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు కార్మిక వర్గాల్లో వినిపిస్తున్నాయని రవి పేర్కొన్నారు. పైగా కొంతమంది అధికారులపై వ్యక్తిగత ప్రయోజనాల కోసం సమాచారం హక్కు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు, తప్పుడు సమాచారం ఇస్తున్నట్టు ఆరోపించారు.
ముందుజాగ్రత్త చర్యలు లేకుంటే ఉద్యమం!
‘‘ఇప్పటికైనా సింగరేణి ఉన్నతాధికారులు స్పందించకపోతే, మేము స్వయంగా సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బలరాం నాయక్‌ను కలిసి ఈ అక్రమాలను వివరిస్తాం. బదిలీలు అమలు చేయకపోతే పెద్దస్థాయిలో ఉద్యమానికి సిద్ధమవుతాం’’ అని కర్నె రవి హెచ్చరించారు.









