గోపీనాథ్ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన మాజీ సీఎం కేసీఆర్
హైదరాబాద్,ఆధాబ్ న్యూస్: బీఆర్ఎస్ పార్టీ నేత, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్పందించారు. మాదాపూర్ డాక్టర్స్ కాలనీలోని గోపీనాథ్ నివాసంలో ఉంచిన ఆయన పార్థివదేహాన్ని ఈరోజు కేసీఆర్ సందర్శించారు. గోపీనాథ్ భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించిన కేసీఆర్, వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
మాగంటి గోపీనాథ్ మరణం పార్టీకి తీరని లోటుగా పలువురు నేతలు భావించారు. ఆయన సేవలను కేసీఆర్ ప్రశంసించారు.









