ఘనంగా బక్రీద్ వేడుకలు – ముస్లింల భక్తి, దాతృత్వానికి ప్రతిరూపం
కరకగూడెం,ఆధాబ్ న్యూస్: త్యాగానికి, దాతృత్వానికి ప్రతీకగా నిలిచే పవిత్ర బక్రీద్ (ఈద్ అల్-అధా) పండుగను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల వ్యాప్తంగా ముస్లింలు శనివారం అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం మసీదుల వద్దకు చేరిన ముస్లిం సోదరులు సామూహిక నమాజ్‌లో పాల్గొన్నారు. అల్లాహ్ పట్ల అంకితభావంతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
నమాజ్ అనంతరం ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రవక్త ఇబ్రహీం త్యాగానికి గుర్తుగా ఖుర్బానీ నిర్వహించారు. ఖుర్బానీ ద్వారా పొందిన మాంసాన్ని మూడు భాగాలుగా విడగొట్టి, ఒక భాగాన్ని కుటుంబ సభ్యుల కోసం ఉంచుకొని, మిగతా రెండింటిని సమాజంలోని పేదలకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ముస్లింలు మాట్లాడుతూ – ‘‘పేదల ముఖాల్లో ఆనందాన్ని చూడగలిగినప్పుడు నిజమైన పండుగ అనుభూతి కలుగుతుంది’’ అని పేర్కొన్నారు. ఈ పండుగ త్యాగం, దాతృత్వం, ప్రేమ, సమానత్వం వంటి విలువలను చాటిచెబుతూ, సమాజ ఐక్యతను పెంపొందించిందని అభిప్రాయపడ్డారు









