బడిబాట కార్యక్రమానికి రంగం సిద్ధం – జూన్ 6 నుంచి 19వ తేదీ వరకు ప్రతిరోజూ ప్రత్యేక కార్యక్రమాలు
పినపాక, ఆధాబ్ న్యూస్:
పినపాక మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రతియేటా నిర్వహించే ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఈసారి జూన్ 6 నుండి 19వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు మండల విద్యాధికారి గడ్డం మంజూల శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2025-26 విద్యాసంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని పాఠశాలల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు విశేషంగా నిర్వహించనున్నట్లు చెప్పారు.
రోజువారీ కార్యక్రమాల వివరాలు:
🔸 జూన్ 6: తొలి రోజు గ్రామసభల నిర్వహణ. తల్లిదండ్రులు, గ్రామస్తుల సలహాలు, సూచనలు తీసుకుని విద్యార్థుల సంఖ్య పెంపుకు చర్యలు.
🔸 జూన్ 7: ఇంటింటికీ వెళ్లి బడిబాలురను గుర్తించాలి.
🔸 జూన్ 8-10: కరపత్రాలతో ఇంటింటి ప్రచారం, అంగన్‌వాడీ కేంద్రాల సందర్శన, డ్రాప్‌ఔట్ పిల్లల గుర్తింపు, భవిత కేంద్రాల్లో చేర్పింపు.
🔸 జూన్ 11: ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలపై సమీక్ష సమావేశం.
🔸 జూన్ 12: అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో కార్యక్రమాల ప్రారంభం, పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాంల పంపిణీ.
🔸 జూన్ 13: సామూహిక అక్షరాభ్యాసం, బాలలసభ నిర్వహణ.
🔸 జూన్ 16: FLN & LIP దినోత్సవం నిర్వహణ.
🔸 జూన్ 17: విలీన విద్య, బాలిక విద్యా దినోత్సవం.
🔸 జూన్ 18: తరగతుల డిజిటలీకరణ అవగాహన, మొక్కల పెంపకం ప్రాధాన్యతపై విద్యార్థులకు తెలియజేత.
🔸 జూన్ 19: బడిబాట ముగింపు సందర్భంగా విద్యార్థులకు క్రీడాపోటీలు.
ఈ సందర్భంగా ఎంఈవో మంజూల మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలలో ఉన్న వసతులు, నాణ్యమైన బోధనను ప్రజలకు తెలియజేసి, మరిన్ని విద్యార్థులను చేరదీసేలా ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ కమిటీలు చొరవ చూపాలని పిలుపునిచ్చారు. “ప్రజలు ప్రభుత్వ పాఠశాలలను ఆదరించాలని, ఈ కార్యక్రమం విద్యా ప్రమాణాలు మెరుగుపరచడంలో మేల్కొలుపు కావాలని ఆశిస్తున్నాం” అని తెలిపారు.









