ఉపాధి సమస్యలపై కలెక్టరేట్ ముట్టడి: ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్: ఉపాధి సమస్యల పరిష్కారం కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట ముట్టడి నిర్వహించనున్నట్లు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు తెలిపారు. సారపాక సుందరయ్య నగరంలో జరిగిన గ్రామ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ, జూన్ 6న ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని గ్రామ సభల్లో ప్రకటించి నోటీసు బోర్డులపై ప్రదర్శించినప్పటికీ, అర్హులుగా ఎంపికైన వ్యక్తులకు ఇళ్లు మంజూరు కాలేదని ఆరోపించారు. అలాగే ‘ఆత్మీయ భరోసా’గా 12,000 రూపాయల సహాయం ప్రకటించినా, ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించారు. అధికారులు తగిన చర్యలు తీసుకోకుండా, ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉండిపోతున్నారని వాపోయారు.
ఈ నేపథ్యంలో జిల్లాలోని 23 మండలాల నుండి కార్మికులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరం ఉపాధి పనులు సరైన రీతిలో అందించలేదని, పనులు చాలా దూర ప్రాంతాల్లో చూపించడం వల్ల కార్మికులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.
బూర్గంపాడు మండలంలో 18 గ్రామ పంచాయతీల్లో సోంపల్లి గ్రామ పంచాయతీ పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై అక్కడ ఇళ్ల పథకం, భరోసా సహాయాలు అమలవుతున్నాయని వెల్లడించారు. అయితే మిగిలిన 17 గ్రామ పంచాయతీల్లో ఒక్క పథకమైనా అమలులోకి రాలేదని తెలిపారు. దీంతో ప్రజలందరూ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు పాపినేని సరోజన, కౌవులురి నాగమణి, మీనా, సాధిక, మారెమ్మ, శివ, పద్మ, రాధా, దమయంతి, సునీత తదితరులు పాల్గొన్నారు.









