నాణ్యమైన విద్యకు ప్రభుత్వ బడులే మార్గం
‘బడిబాట’పై సమీక్షా సమావేశం – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సమగ్ర కార్యాచరణ
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల ప్రవేశాలను పెంపొందించేందుకు బడిబాట కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు.
జూన్ 6 నుండి 19వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న బడిబాట కార్యక్రమాలపై మంగళవారం ఐడీవోసీ కార్యాలయంలో లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ:
6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరినీ బడికి పంపేలా చర్యలు తీసుకోవాలి.
మధ్యలో చదువు మానిన పిల్లలను గుర్తించి, తల్లిదండ్రులతో చర్చించి పునఃప్రవేశం కల్పించాలి.
పాఠశాలల్లోని ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫార్మ్స్, డిజిటల్ విద్య, ఉపకార వేతనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి.
ప్రభుత్వ పాఠశాలల్లోని నాణ్యమైన విద్యపై తల్లిదండ్రులలో నమ్మకం కల్పించాలి.
మహిళా సంఘాలు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, గ్రామ పెద్దలు బడిబాటలో భాగస్వాములు కావాలి.
పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి వెనకడుగు వేసే తల్లిదండ్రుల కారణాలను గుర్తించి నమోదు చేయాలి.
ప్రతి పాఠశాలలో తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలి.
రెండు వారాల్లో శిథిల పాఠశాలలను గుర్తించి మరమ్మతులు పూర్తి చేయాలి.
ఉపాధి హామీ పథకం ద్వారా ప్రహరీ గోడల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి.
ఏకరూప దుస్తుల తయారీని ఐదు రోజుల్లో పూర్తిచేయాలి.
భవిత కేంద్రాల ద్వారా ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు వైద్య సేవలు అందించాలి.
‘ఉల్లాసం’ యాప్ ద్వారా 15 ఏళ్ల పైబడిన నిరక్షరాస్యుల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలి.
జిల్లాలో 100% అక్షరాస్యత సాధించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి.
పర్యావరణ పరిరక్షణ – స్కూళ్ళలో ప్లాంటేషన్ లక్ష్యం
ఎకో క్లబ్‌ల ఆధ్వర్యంలో స్కూళ్లలో సీడ్ బ్యాంకులు ఏర్పాటు చేయాలని, విత్తనాలు సేకరించిన పాఠశాలలకు బహుమతులు అందజేయాలని తెలిపారు. ప్రతి పాఠశాలలో తులసి, మునగ, ఉసిరి, వెలగ, కరివేపాకు, చింత చెట్లను నాటి, 100% ప్లాంటేషన్ పూర్తి చేయాలని సూచించారు.
అజోల్ల, బయోచార్, కంపోస్ట్ ఎరువులు, ఇంకుడు గుంతలు, ఫామ్ పౌండ్స్ వంటి ప్రకృతి రీత్యా వ్యవస్థలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
సమీక్షలో పాల్గొన్నారు:
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విద్యా చందన, సిపిఓ సంజీవరావు, మెప్మా పీడీ రాజేష్, జిల్లా విద్యాధికారి ఎం. వెంకటేశ్వర చారి, బీసీ సంక్షేమ అధికారి ఇందిర, మహిళా శిశు సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా, జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు, మండల విద్యాధికారులు, ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు.
పిపిటి ప్రజెంటేషన్ల ద్వారా అధికారులకు పూర్తి అవగాహన కల్పించబడింది.









