ప్రతి క్షణం
ప్రజల పక్షం

  సింగరేణి కార్పొరేట్ మెడికల్ బోర్డు షెడ్యూల్ ఖరారు చేయాలి – సింగరేణి సీఎండీకి వినతిపత్రం అందజేసిన కర్నే బాబురావు

సింగరేణి కార్పొరేట్ మెడికల్ బోర్డు షెడ్యూల్ ఖరారు చేయాలి – సింగరేణి సీఎండీకి వినతిపత్రం అందజేసిన కర్నే బాబురావు

కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
సింగరేణి కార్పొరేట్ మెడికల్ బోర్డు (CMB) ప్రక్రియను తక్షణమే ప్రారంభించి, అర్హులైన దరఖాస్తుదారులకు న్యాయం చేయాలన్న కోరనుతో సామాజిక సేవకుడు కర్నే బాబురావు సోమవారం నాడు సింగరేణి సీఎండీ డి.ఎన్. బలరాం (ఐఆర్ఎస్) గారికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని సీఎండీకి మొక్కను బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, గత మూడు నెలలుగా కార్పొరేట్ మెడికల్ బోర్డు కార్యకలాపాలు నిలిచిపోయినందున, ఇప్పటికే హైదరాబాదులోని హయ్యర్ సెంటర్‌కు ఆరోగ్య పరీక్షల కోసం వెళ్లిన దరఖాస్తుదారులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని బాబురావు తెలిపారు. ఆరోగ్య పరీక్షలు పూర్తి చేసి, నివేదికలు సమర్పించినా ఇంకా మెడికల్ బోర్డులో పాల్గొనడానికి తేదీలు ఖరారు కాకపోవడం వల్ల వారు ఆర్థిక, మానసిక ఇబ్బందులకు లోనవుతున్నారని వివరించారు.

ఇటువంటి పరిస్థితుల్లో సింగరేణి సీఎండీ వంటి బాధ్యతగల వ్యక్తులు హస్తక్షేపం చేసి, మానవతా దృక్పథంతో మెడికల్ బోర్డు షెడ్యూల్‌ను త్వరగా ఖరారు చేయాలని బాబురావు కోరారు. బోర్డు సమావేశాలు జరిగే రోజుల్లో కార్మికులకు కల్పించే సౌకర్యాలను మెరుగుపరచాలని, అలాగే సింగరేణి ఆసుపత్రిలో మందుల కొరతను తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

సింగరేణి సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బలరాం గారు సంస్థ అన్ని శాఖలలో పనిచేసే విధానాన్ని మెరుగుపరిచేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని బాబురావు ప్రశంసించారు. కొత్త గనుల అనుమతులు, ఉత్పత్తి లక్ష్యాల సాధన, ఉద్యోగులతో ప్రత్యక్షంగా సంప్రదింపులు వంటి చర్యలతో సంస్థ అభివృద్ధికి దోహదం చేస్తున్నారని అన్నారు. కార్మిక సంఘాల నాయకులే కాకుండా సాధారణ కార్మికులు మరియు వారి కుటుంబాలు కూడా సీఎండీ గారిని కలిసిన సమయంలో గర్వంతో ‘మా పెద్ద కొడుకుని కలిశాం’ అన్న సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితో పాటు ఇతర రంగాలలో విస్తరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమని, నేషనల్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NMDC)లో ఇతర ఖనిజాల వెలికితీతలో కూడా పాత్ర వహిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

చివరగా, వినతిపత్రానికి సానుకూలంగా స్పందించినందుకు సింగరేణి సీఎండీకి బాబురావు కృతజ్ఞతలు తెలిపారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!