రెండు నెలల నిరంతర శ్రమ.. వెంటిలేటర్‌పై ఉన్న గిరిజన యువతికి ప్రాణదానం చేసిన భద్రాచలం ఆసుపత్రి సిబ్బంది
భద్రాచలం, ఆధాబ్ న్యూస్:
మానవత్వానికి మారు పేరుగా నిలిచారు భద్రాచలం ఏరియా ఆసుపత్రి వైద్య సిబ్బంది. రెండు నెలల పాటు వెంటిలేటర్‌పై చికిత్స పొందిన గిరిజన యువతిని ప్రాణాపాయం నుండి రక్షించి, మరో జీవితం అందించారు. చర్ల మండలం లక్ష్మీ కాలనీకి చెందిన 22 ఏళ్ల మడకం శిరీష, గత ఏప్రిల్ 1న మోనోక్రోటోఫోస్ అనే విషపూరిత పురుగుల మందు తాగి తీవ్ర అస్వస్థతకు గురైంది.
ఆమెను మొదటగా చర్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించగా, అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేశారు. మానవ శ్వాసనాళాలపై తీవ్ర ప్రభావం చూపించే ఈ విషపదార్థం వల్ల శిరీష కోన ఊపిరితో ఉన్న పరిస్థితిలో రెండునెలల పాటు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందింది.
డాక్టర్ జగదీష్ నేతృత్వంలో ఆసుపత్రి వైద్య బృందం రెండు నెలల పాటు నిరంతరంగా శ్రమించి, శిరీషను కోలుకునేలా చేశారు. ఆమెను డిశ్చార్జ్ చేస్తున్న సందర్భంలో భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీ.ఓ రాహుల్, డిసిహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు, ఆసుపత్రిని సందర్శించి వైద్య సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
అలాగే, శిరీషకు అత్యవసర సమయంలో ప్రాథమిక చికిత్స అందించిన చర్ల ఆసుపత్రి సిబ్బందినీ, వారి వేగవంతమైన స్పందనకు జిల్లా ఉన్నతాధికారులు ప్రశంసలు కురిపించారు. భద్రాచలం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ సేవలను కూడా కలెక్టర్ అభినందించారు. కృతజ్ఞతలు తెలిపిన తండ్రి
“నా కూతురికి పునర్జన్మ ఇచ్చిన డాక్టర్లకు ఎంత కృతజ్ఞతలు తెలపినా తక్కువే. రెండు నెలలుగా మా బిడ్డను కంటికితెరగా చూసిన వైద్య సిబ్బందికి మా కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటుంది,” అంటూ శిరీష తండ్రి రమేష్, ఆనందభాష్పాలతో కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సంఘటన వైద్యసేవల విలువను చాటిచెప్పడంతో పాటు, ప్రభుత్వ వైద్య వ్యవస్థపై నమ్మకాన్ని మరింత బలపరిచింది.









