బయ్యారంలో విషాదం: రిసెప్షన్‌కు కొద్దిసేపట్లో పెళ్లికొడుకు మృతి
బయ్యారం, ఆధాబ్ న్యూస్: బయ్యారం మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెళ్లి రిసెప్షన్‌కు కొద్దిసేపట్లో పెళ్లికొడుకు కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన కోడిపుంజుల తండాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే, బయ్యారం మండలం కోడిపుంజుల తండాకు చెందిన ఇస్లావత్ నరేష్ వివాహం సోమవారం విజయవాడలో ఘనంగా జరిగింది. పెళ్లి అనంతరం వధూవరులు స్వగ్రామానికి చేరుకున్నారు. మంగళవారం (ఈరోజు) కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో రిసెప్షన్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతుండగా, ఈ విషాదం జరిగింది.
రిసెప్షన్‌కు కొద్దిగంటల ముందు నరేష్ నీళ్ల కోసం కరెంట్ మోటార్ ఆన్ చేస్తుండగా అజ్ఞాతంగా విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తాము కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నామని భావించిన క్షణాల్లోనే నరేష్ మృతి చెందడంతో రెండు కుటుంబాల్లోను తీవ్ర విషాదం అలముకుంది.









