భద్రాద్రి కొత్తగూడెంలో తుడుందెబ్బ హెచ్చరిక: అక్రమ ఇసుక వ్యాపారం పై చర్యలు తీసుకోండి
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని ఆశ్వాపురం మండలంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లెం కోటి మాట్లాడుతూ, “బినామీల పేరుతో నడుస్తున్న అక్రమ ఇసుక వ్యాపారాన్ని అరికట్టాలి. సీతమ్మ సాగర్ కెనాల్‌కు అడ్డుగా మట్టి వేసి రహదారిలా మార్చిన బడే బాబులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలి” అని డిమాండ్ చేశారు.
1 ఆఫ్ 70 చట్టానికి విరుద్ధంగా సీతమ్మ సాగర్ కెనాల్‌కు సంబంధించిన రాళ్లతో గిరిజనేతరులు క్రషర్ మిల్లులను నడుపుతున్నారనీ, వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
అల్లెం కోటి పేర్కొంటూ, “తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సాగునీరు సమస్య లేకుండా ఉండాలని సీతమ్మ సాగర్ ప్రాజెక్టును అప్పటి ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం దానిని పూర్తి చేయడానికి కృషి చేస్తోంది. అయితే కొందరు బడా కాంట్రాక్టర్లు, వ్యాపారులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వ లక్ష్యాలను దెబ్బతీశారు” అని అన్నారు.
“కొమరం భీమ్ జీవితం జల్, జంగల్, జమీన్ కోసం అంకితం చేశాడు. అయినప్పటికీ ఈ రోజు ఆదివాసీలకు ఆ వనరులు దూరమవుతున్నాయి” అని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మార్వో గతంలో ఇచ్చిన లిఖిత పిర్యాదులను పట్టించుకోకపోవడం, విలేకరుల ప్రశ్నలకు ‘నా శాఖ కాదు’ అని తప్పించుకోవడం న్యాయమా అని ప్రశ్నించారు.
ఇరిగేషన్, రెవిన్యూ, ఎంపీడీవో, టీఎస్ఎండీసీ అధికారులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని, కానీ వారు బడే బాబుల ప్రయోజనాల కోసం ఒకరిపై ఒకరు త్రోసుకుంటూ గోదావరిలో రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయని విమర్శించారు.
“బినామీల పేరుతో కోట్లాది రూపాయల అక్రమంగా సంపాదిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఈ వ్యవహారంపై ఆర్డీవో, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి, జిల్లా కలెక్టర్లు విచారణ చేసి చర్యలు తీసుకోవాలి” అని కోరారు.
“5వ షెడ్యూల్ భూముల్లో, 1 ఆఫ్ 70 చట్టం, 9/77 (పీఓటీ), ఎల్టీఆర్, పెసా చట్టం ఉల్లంఘనలతో పాటు అసైన్మెంట్ భూములు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు ఆశ్వాపురం మండలంలో విపరీతంగా జరుగుతున్నాయి. అధికారులు ముడుపులు తీసుకొని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు” అని ఆరోపించారు.
“ఆదివాసీ వనరులను కాపాడేందుకు ఉన్నతస్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తాం. న్యాయస్థానాన్ని ఆశ్రయించడమేగాక, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తాం” అని అల్లెం కోటి స్పష్టం చేశారు.









