మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న బస్సులో సీటు వివాదం – ఇద్దరు మహిళల మధ్య ఘర్షణ.
భద్రాచలం, మే 15, ఆధాబ్ న్యూస్; మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సులో సీటు వివాదం తీవ్ర స్థాయికి చేరింది. బుకింగ్ చేసిన సీటు విషయంలో ఇద్దరు మహిళల మధ్య వాగ్వాదం ప్రారంభమై, క్షణాల్లోనే ఘర్షణకు దారి తీసింది.
ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు, ఒక మహిళ బుక్ చేసుకున్న సీటును మరో మహిళ ఆక్రమించడంతో మాటల యుద్ధం మొదలైంది. విషయం ఉధృతంగా మారి, బస్సులో ప్రయాణిస్తున్న ఇతరుల ముందు సుదీర్ఘ వాదన కొనసాగింది. పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం కనిపించడంతో, అక్కడి ప్రయాణికులు బస్సును అశ్వాపురం పోలీస్ స్టేషన్ వద్ద ఆపించారు.
పోలీసులు వెంటనే స్పందించి ఇద్దరు మహిళలను స్టేషన్‌కు తరలించి విచారణ ప్రారంభించారు. ఈ సంఘటన నేపథ్యంలో వారు మద్యం సేవించారా లేదా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనతో బస్సులో ప్రయాణిస్తున్నవారు కొంతసేపు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చింది. పోలీసులు విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.









