మణుగూరు పీవీ కాలనీలో చోరీల నివారణకు చర్యలు తీసుకోవాలి
ఏరియా జిఎం దుర్గం రామచందర్కు వినతి పత్రం అందజేసిన కార్మిక సంఘాల నాయకులు, కాలనీవాసులు
మణుగూరు, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియాలోని పీవీ కాలనీ క్వార్టర్స్ పరిధిలో ఇటీవల చోటు చేసుకున్న వరుస చోరీలపై స్థానిక కాలనీవాసులు, కార్మిక సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. చోరీల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం వారు ఏరియా జీఎం దుర్గం రామచందర్కు వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐటియుసి, సీఐటీయూ, హెచ్ఎంఎస్, ఐఎఫ్టీయూ కార్మిక సంఘాల నాయకులతో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు. గోదావరిలోయ బొగ్గుగని కార్మిక సంఘం (ఐఎఫ్టీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.డి. నాసర్ పాషా మాట్లాడుతూ, ఈ నెల 12వ తేదీన రాత్రి ఏడుకు పైగా క్వార్టర్లలో దొంగలు హల్చల్ చేశారని తెలిపారు. తమ క్వార్టర్లో కూడా చోరీ జరిగినట్లు పేర్కొన్నారు. దొంగలు కొన్ని చోట్ల కార్ల కీస్లు, బంగారం, వెండి ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లినట్లు వివరించారు.
చోరీలపై సింగరేణి యాజమాన్యం, పోలీసుల సమన్వయంతో బాధితులను ఓదార్చిన తీరును ప్రశంసించారు. అయితే ఇలాంటివి మరల జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో సూచించారు.
వారు చేసిన ముఖ్యమైన సూచనలు ఇవే:
కాలనీలో సీసీ కెమెరాలను మరింత విస్తరించి, పూర్ణ స్థాయిలో పని చేసేలా చూడాలి.
వారాంతపు సంతలు, ప్రధాన కూడళ్ల వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
విద్యుదీకరణ మెరుగుపరచాలి, కాలనీ చుట్టూ పటిష్టమైన ఫెన్సింగ్ నిర్మించాలి.
చిరు వ్యాపారులు, చేతివృత్తిదారులు, కొరియర్ సర్వీసు వ్యక్తులు కాలనీకి వచ్చేప్పుడు సెక్యూరిటీ అనుమతి తప్పనిసరిచేయాలి.
వాటర్ ట్యాంకులు శుభ్రపరిచే కార్మికుల రాకపోకలపై నిఘా ఉండాలి.
ప్రతిరోజూ సింగరేణి సెక్యూరిటీ విభాగం సమన్వయంతో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలి.
పోలీస్ కంట్రోల్ రూమ్ పునరుద్ధరించాలి.
ఎస్టిపి ప్లాంట్, భద్రాద్రి స్టేడియం వెనుక అటవీ ప్రాంతం, కూనవరం వాటర్ ట్యాంక్, పాడైన క్వార్టర్స్ లాంటి ప్రాంతాల్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలి.
కాలనీ అభివృద్ధికి, భద్రతకూ దోహదపడేలా వెల్ఫేర్ కమిటీలను పునరుద్ధరించాలని వక్తలు కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నేతలు ఎం.వి. రామనర్సయ్య, సీఐటీయూ నేత వల్లూరు వెంకటరత్నం, కొడిపల్లి శ్రీలత, కళ్యాణం రవికుమార్, ఐఎఫ్టీయూ నాయకులు అంగోత్ మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.









