ఏజెన్సీ అభివృద్ధిపై మంత్రి తుమ్మల ప్రత్యేక దృష్టి
ఖమ్మం, ఆధాబ్ న్యూస్:
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏజెన్సీ ప్రాంత అభివృద్ధిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి సారించారు. అడవుల సంరక్షణ, రహదారుల నిర్మాణం, టూరిజం అభివృద్ధి, ఆదాయ వనరుల పెంపు వంటి అంశాలపై మంత్రి తుమ్మల ఔత్సాహికంగా చర్యలు చేపడుతున్నారు.
సచివాలయంలో ప్రధాన అటవీ సంచాలకులు (PCCF) శ్రీమతి సువర్ణ, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ MD సునీతతో మంత్రి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అటవీశాఖ పెండింగ్ సమస్యల పరిష్కారం, అడవుల సంరక్షణ, వన సంపద పరిరక్షణపై సుదీర్ఘంగా చర్చించారు.
అటవీశాఖ అనుమతులు పెండింగ్లో ఉన్న రహదారుల నిర్మాణానికి తక్షణమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 6 ప్రధాన రహదారుల నిర్మాణానికి అటవీ అనుమతులు మంజూరు చేయాలని PCCFను కోరారు. జూలూరుపాడు, చుంచుపల్లి, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, టేకులపల్లి, దుమ్ముగూడెం మండలాల్లో ఈ రహదారులు ప్రతిపాదితమయ్యాయి.
అలాగే, టూరిజం అభివృద్ధిపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. ఖమ్మం వెలుగుమట్ల పార్క్, సత్తుపల్లి, తల్లాడ మండలాల్లో కనిగిరి హిల్స్ ఎకో టూరిజం, కొత్తగూడెంలో ఎకో పార్క్ అభివృద్ధికి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆధునిక సౌకర్యాలతో ఈ పార్కులను అభివృద్ధి చేయాలని సూచించారు.
గిరిజన ఆదాయ వనరుల పెంపుదల దిశగా చర్యలు తీసుకోవాలని కూడా మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పోడు భూములలో వెదురు సాగును ప్రోత్సహించాలన్నారు. ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా గిరిజనుల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
గతంలో ఉన్న ప్రాధాన్యతను మళ్లీ తెచ్చేలా, అటవీ సంచాలకులు మరియు కార్పొరేషన్ అధికారులు పనిచేయాలని మంత్రి తుమ్మల ఆకాంక్షించారు. వన సంరక్షణతోనే ప్రకృతి పరిరక్షణ సాధ్యమవుతుందని, ఇది మనవజాతి భవిష్యత్తుకు అవసరమని ఆయన స్పష్టం చేశారు.









