భద్రాద్రి కొత్తగూడెం: పరిశ్రమల భద్రతపై ఎస్పీ సూచనలు – అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్: భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ జిల్లా లోని ప్రభుత్వ, ప్రైవేట్ పరిశ్రమల భద్రతాధికారులతో సమావేశం నిర్వహించాడు. ఈ సమావేశం ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది.
అశ్వాపురం భారజల ఉత్పత్తి కేంద్రం, సారపాక ఐటిసీ, KTPS, BTPS, NAVA లిమిటెడ్ కంపెనీల భద్రతాధికారులు, సంబంధిత పోలీసు అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పరిశ్రమల వద్ద భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలన్నది ఎస్పీ ప్రధాన సూచన. భారత ప్రభుత్వం విడుదల చేస్తున్న మార్గదర్శకాలను పాటిస్తూ, భద్రతా విధానాలను క్రమబద్ధీకరించాలని అధికారులకు సూచించాడు.
అలారం సిస్టమ్‌ను ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు మరియు చుట్టుపక్కల ప్రజలకు అర్థమయ్యేలా ప్రాక్టీస్ చేయాలని, ప్రతి ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపాడు. ప్రధాన గేట్ల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు ఉండాలని, అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్న సూచనలు చేశాడు. మావోయిస్టు కార్యకలాపాలపై కూడా ప్రత్యేక నిఘా అవసరమని స్పష్టం చేశాడు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరిశ్రమల వద్ద గస్తీ ముమ్మరం చేయాలని, అత్యవసర సమయాల్లో ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించాడు.
ఈ సమావేశంలో కమాండెంట్ అమిత్ కుమార్ (భారజల), డీఎస్పీలు రవీందర్ రెడ్డి (మణుగూరు), సతీష్ కుమార్ (పాల్వంచ), ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సీఐలు వెంకటేశ్వర్లు, అశోక్ రెడ్డి, ఐటిసీ సెక్యూరిటీ ఆఫీసర్ మనీష్ శర్మ, KTPS అసిస్టెంట్ కమాండెంట్ చంద్రశేఖర్, BTPS అసిస్టెంట్ కమాండెంట్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.









