ప్రతీ ఇంటర్మీడియట్ విద్యార్థి U-DISE+ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు కావాలి: కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం,మే 8 ఆధాబ్ న్యూస్:
ఇంటర్మీడియట్ పరీక్ష రాసిన ప్రతి విద్యార్థిని U-DISE+ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. గురువారం సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
ఈ సందర్భంగా, ఇంటర్మీడియట్ పరీక్షల్లో బాలికల కంటే బాలురు తక్కువ ఉత్తీర్ణత సాధిస్తున్న విషయంపై జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వరరావుతో చర్చించి, కారణాలు తెలుసుకున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి పలు సూచనలు చేశారు.
అలాగే, ఇంటర్మీడియట్ కళాశాలల్లో డిజిటల్ ఎడ్యుకేషన్‌ను ప్రోత్సహిస్తూ, ఫేషియల్ అటెండెన్స్ సిస్టమ్‌ను అమలులోకి తేవాలని సూచించారు. కళాశాలల్లోని పెద్ద మైదానాలను ఉపయోగించి ఎకరాకు కనీసం ఐదు ఇంకుడు గుంతలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య మరియు U-DISE+ పోర్టల్‌లో నమోదు గల విద్యార్థుల సంఖ్య మధ్య భారీ తేడా ఉందని కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత కళాశాల ప్రిన్సిపాళ్లను పిలిపించి, జిల్లా విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులందరినీ వెంటనే నమోదు చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) విద్యా చందన, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర చారి, పలువురు కోఆర్డినేటర్లు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.









