బెట్టింగ్ యాప్ బారిన మరో బలి – పెద్దపల్లిలో విషాదం
పెద్దపల్లి, ఆధాబ్ న్యూస్
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లు మరో యువకుడి ప్రాణం తీసుకున్నాయి. స్థానిక టీ2-185 క్వార్టర్లో నివసిస్తున్న వేముల వసంత్ కుమార్ (27) ఆదివారం ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
వివరాల్లోకి వెళితే, వసంత్ కుమార్ కొంతకాలంగా ఆన్లైన్ బెట్టింగ్‌లకు బానిసయ్యాడు. గతంలోనూ భారీ నష్టాలు ఎదుర్కొన్న అతడిని తండ్రి మందలించి, అప్పులు చేసి సుమారు రూ.4 లక్షల వరకు చెల్లించారు. అప్పట్లో మారతాడని ఆశించిన కుటుంబ సభ్యులు.. అతను మళ్లీ అదే చెడుపనిలో పడటంతో తీవ్రంగా బాధపడ్డారు.
తాజాగా మళ్లీ నష్టపోయిన వసంత్ కుమార్ తీవ్రమైన మనోవేదనకు గురై, ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు అతను ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఘటనా స్థలానికి చేరుకున్న వారు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
ఈ సంఘటన స్థానికంగా తీవ్ర ఉద్విగ్నత కలిగించింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లపై నిర్బంధ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ మళ్లీ ఒక్కసారిగా ఊపందుకుంది.









