నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన 14మంది లొంగింపు – భద్రాద్రి జిల్లా పోలీసులు అదుపులోకి.
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్: నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన 14 మంది సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. హేమచంద్రపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మంగళవారం వెల్లడించారు.
లొంగిపోయిన వారిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. వీరంతా మావోయిస్టు పార్టీకి అనుబంధంగా పనిచేస్తూ పలు అక్రమ కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు గుర్తించారు. ప్రభుత్వ పునరావాస విధానాలను సద్వినియోగం చేసుకోవాలని, మిగతా మావోయిస్టులు కూడా మెయిన్ స్ట్రీమ్‌లోకి రావాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
పోలీసులు అందించిన వివరాల ప్రకారం, లొంగిపోయిన వారికి ప్రభుత్వం నుంచి పునరావాసం, పునాది సహాయం, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఇది ఒక కీలక మలుపుగా పోలీసులు భావిస్తున్నారు.









