హైదరాబాద్, ఆధాబ్ న్యూస్
తెలంగాణ రాష్ట్ర రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబోయే రోజు సమీపిస్తోంది. ఓరుగల్లు వేదికగా27 తారీకున జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ తెలంగాణ ఉద్యమ ప్రేరణను తిరిగి గుర్తు చేస్తూ, భవిష్యత్ తెలంగాణకు మార్గదర్శకంగా నిలుస్తుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) ప్రకటించారు.
బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల విశిష్ట ప్రస్థానానికి గుర్తుగా నిర్వహిస్తున్న ఈ రజతోత్సవ సభ, లక్షలాది ప్రజల సాక్షిగా, తెలంగాణ ఆత్మగౌరవ యాత్రకు కొత్త శక్తిని అందించబోతోందని ఆయన తెలిపారు.
25 ఏళ్ల ఘన చరిత్ర
1999లో జన్మించిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి) తన స్థాపనలక్ష్యమైన తెలంగాణ రాష్ట్ర సాధనను ఘనంగా సాధించడమే కాకుండా, ఆ రాష్ట్రాన్ని దేశంలో ఆదర్శంగా నిలిపేందుకు విశేషంగా కృషి చేసింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పలు రంగాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సామాజిక సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ పార్టీ ప్రజల మనసుల్లో మరింత బలంగా నిలిచేలా చేశాయి.
ఈ 25 ఏళ్ల ప్రస్థానం ప్రజల నమ్మకం, ఆకాంక్షల ఫలితం అని కేటీఆర్ పేర్కొన్నారు. “బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉద్యమానికి అంకితమైతే, ఇప్పుడు అభివృద్ధి, సమగ్ర సంక్షేమం కోసం పని చేస్తోంది. రాబోయే రోజుల్లో కొత్త తెలంగాణ నిర్మాణానికి నూతన దిశను ఈ సభ ద్వారా ప్రతిపాదించబోతున్నాం,” అని ఆయన వివరించారు.
లక్షలాది గులాబీ సైనికుల సమాహారం
వరంగల్ సభకు ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి గులాబీ సైనికులు భారీ సంఖ్యలో తరలిరావడానికి సిద్దమవుతున్నారు. రైతులు, కార్మికులు, విద్యార్థులు, మహిళలు, యువత– ప్రతి వర్గానికి చెందిన ప్రజలు ఈ సభలో పాల్గొని బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలవబోతున్నారు.
పార్టీ నాయకులు సభ ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన పర్యవేక్షిస్తున్నారు. సభ స్థలంలో విస్తృత ఏర్పాట్లు, భద్రతా చర్యలు, తాగునీరు, వైద్య సహాయం వంటి అన్ని వసతులు కల్పించబడుతున్నాయి.
ఓరుగల్లు వేదికగా రాజకీయ సందేశం
ఈ రజతోత్సవ సభ ద్వారా కేవలం పార్టీ విజయగాథను గుర్తు చేసుకోవడం మాత్రమే కాకుండా, తెలంగాణ భవిష్యత్ అభివృద్ధి మార్గపటాన్ని ప్రజల ముందుకు తెచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలియజేశాయి. రాష్ట్రం తదుపరి దశలోకి దూసుకుపోవడంలో బీఆర్ఎస్ తన ప్రధాన పాత్రను కొనసాగించబోతోందని స్పష్టం చేశారు.
చరిత్రను తిరిగి సృష్టించబోయే సభ
“ఓరుగల్లు గడ్డపై మరోసారి చరిత్ర సృష్టించబోతున్నాం. ప్రజలు మమ్మల్ని నమ్మారు, మేము వారి ఆశయాలను నెరవేర్చడానికి నిరంతరం కృషి చేస్తాము. ఈ సభ, తెలంగాణ కోసం బీఆర్ఎస్ పాటించే మార్గాన్ని నిస్సందేహంగా ప్రపంచానికి చాటుతుంది,” అని కేటీఆర్ గర్వంగా ప్రకటించారు









